ఇప్పుడు ప్రీమియర్ షోస్ అంటే చరణ్ ఫ్యాన్స్ భయపడుతున్నది అందుకే మరి. ఒకప్పుడు ప్రీమియర్స్ వేస్తున్నారంటే ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోయే వాళ్లు. తమ హీరో సినిమాను అందరికంటే ముందు రాత్రికే చూస్తున్నాం అనే ఆనందం వాళ్లలో ఉండేది కానీ ఇప్పుడు అది కనిపించడం లేదు. రాత్రి షోలు పడితే టాక్ పాజిటివ్ అయితే ఓకే కానీ నెగిటివ్ అయితే మాత్రం నష్టం ఊహకు కూడా అందడం లేదు. ఈ నష్టం ఎలా ఉంటుందో రామ్ చరణ్ అభిమానులకు బాగా తెలుసు. గతంలో ఈయన బ్రూస్లీ సినిమాకు ఇదే జరిగింది. ఈ సినిమాకు ముందు రోజు రాత్రే భారీగా ప్రీమియర్స్ వేసారు. నిజానికి సినిమా యావరేజ్ గానే ఉన్నా.. బయట టాక్ మాత్రం దారుణం అని వెళ్లింది. దాంతో విడుదల రోజు మార్నింగ్ షోకు సినిమా డిజాస్టర్ అని డిసైడ్ అయ్యారు ప్రేక్షకులు. దాంతో బ్రూస్లీకి కోలుకోలేని దెబ్బ పడింది. అప్పట్నుంచీ ప్రీమియర్ షో లకు దూరంగా ఉన్నాడు చరణ్. కానీ ఇప్పుడు మళ్లీ రంగస్థలంకు అది చేస్తున్నారు. ఈ చిత్రానికి భారీ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. మార్చ్ 29 రాత్రి నుంచే ప్రీమియర్స్ పడనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రంగస్థలం రచ్చ మొదలు కానుంది. సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంపై చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు మెగా వారసుడు. దాంతో రంగస్థలం ప్రీమియర్స్ షోస్ వేస్తామని చెప్పినపుడు కూడా ఓకే అనేసాడు. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అని ముందు నుంచే ఫిక్స్ అయిపోయాడు ఈ హీరో. అందుకే ప్రీమియర్స్ వేసినా లాభమే తప్ప నష్టం ఉండదంటున్నాడు. పైగా సుకుమార్ దర్శకుడు కావడంతో ఓవర్సీస్ లో కూడా సినిమా కుమ్మేయడం ఖాయం. మొత్తానికి చూడాలిక.. బ్రూస్లీ చేదు జ్ఞాపకాలను రంగస్థలం మరిపిస్తుందో లేదో..?