అనుకున్నదే జరుగుతుంది. అప్పుడెప్పుడో డిసెంబర్ లో మొదలు కావాల్సిన సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ఇప్పుడు అప్పుడూ అంటున్నాడే కానీ వెంకటేశ్ సినిమా ఇప్పటికీ మొదలు పెట్టలేదు తేజ. లాంఛనంగా పూజా కార్యక్రమాలు చేసుకుంది కానీ పట్టాలెక్కిన పాపాన పోలేదు. దాంతో ఈ చిత్రం ఉంటుందా ఉండదా అని చాలా రోజులుగా ప్రేక్షకుల్లో అనుమానాలు ఉన్నాయి. దానికి కారణం కూడా లేకపోలేదు. వెంకీ సినిమాతో పాటే బాలయ్యతో ఎన్టీఆర్ బయోపిక్ కు కూడా కమిటయ్యాడు తేజ. ఈ రెండు సినిమాలు ఒకేసారి తెరకెక్కించడం అంటే మాటలు కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నది పెద్దాయన బయోపిక్. ఎలాంటి ప్రీ ప్రొడక్షన్ లేకుండా నేరుగా వెళ్లి ఎన్టీఆర్ బయోపిక్ చేయడం అంటే ఈజీ కాదు. ఏ చిన్న తేడా జరిగినా అభిమానుల నుంచే కాదు.. తేజ కెరీర్ పై కూడా మచ్చ పడుతుంది. ఈ రోజుల్లో ఓ పెద్ద సినిమా పూర్తి చేయాలంటే ఎంత ఫాస్ట్ గా పూర్తి చేసినా కూడా కనీసం ఆర్నెళ్లైనా కావాలి. కానీ తేజ మూడు నెలల్లో చేయాలనుకున్నాడు. అది కుదరదని.. అంత ఈజీ కాదని ఇప్పుడు అర్థమైంది. దాంతో వెంకటేశ్ సినిమాను తప్పక పక్కన బెట్టేసాడని తెలుస్తుంది. తేజ సినిమా కాకుండా మరో రెండు సినిమాలకు కమిటయ్యాడు వెంకటేశ్. ఆ రెండు కూడా మల్టీస్టారర్స్ కావడం విశేషం. బాబీ దర్శకత్వంలో మేనల్లుడు నాగచైతన్యతో ఓ సినిమా.. అనిల్ రావిపూడితో ఎఫ్ 2 సినిమాలో నటిస్తున్నాడు వెంకటేశ్. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్నాడు. మొత్తానికి తేజ ఆట వేట వెంకటేశ్ తో కుదర్లేదన్నమాట.