ఒక్క సినిమాతో పడిపోయే ఇమేజ్ కాదు త్రివిక్రమ్ ది. అది ఆయనకు కూడా తెలుసు.. ప్రేక్షకులకు అంత కంటే బాగా తెలుసు. 20 ఏళ్లుగా ఆయన్ని చూస్తున్నారు.. ఆయన ఎలాంటి దర్శకుడో.. ఎంత గొప్ప రచయితో అందరికీ తెలిసిందే. కాకపోతే ఎంతపెద్ద దర్శకుడు అయినా ఎప్పుడో ఓ సారి తప్పు చేస్తాడు. అది త్రివిక్రమ్ కు అజ్ఞాతవాసి విషయంలో జరిగింది. సరిదిద్దుకోలేని కాస్ట్ లీ మిస్టేక్ గా ఈ చిత్రం మాటల మాంత్రికుడి కెరీర్ లో మచ్చగా మిగిలిపోయింది. ఈ చిత్రంతో విమర్శలు కూడా అందుకున్నాడు ఈ దర్శకుడు. ఇప్పుడు దాన్ని దాటుకుని ఛల్ మోహన్ రంగాకు మాట సాయం చేసాడు గురూజీ. ఈ సినిమా ఇప్పుడు విడుదలైంది. అజ్ఞాతవాసిలో మిస్ అయిన అంశాలన్నీ ఇందులో కనిపించాయి. వింటేజ్ త్రివిక్రమ్ పంచ్ డైలాగులు ఛల్ మోహన్ రంగాలో కనిపించాయి. దీనికి మాటలు రాసింది కృష్ణచైతన్య అయినా కూడా ఎందుకో కానీ త్రివిక్రమ్ ఛాయలన్నీ బాగా కనిపించాయి సినిమాలో. ముఖ్యంగా కొన్ని డైలాగులు కేవలం త్రివిక్రమ్ కే సాధ్యం. అలాంటివి చాలా ఉన్నాయి ఈ చిత్రంలో. చల్ మోహన్ రంగా అద్భుతంగా ఉంది అని చెప్పలేం కానీ టైమ్ పాస్ ఎంటర్ టైనర్ అని మాత్రం చెప్పొచ్చు. ఇది చూసిన తర్వాత కచ్చితంగా త్రివిక్రమ్ ఫామ్ లోకి వచ్చినట్లే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంక హ్యాపీగా ఉండొచ్చనేది మాత్రం అర్థమవుతుంది. మొత్తానికి చూడాలిక.. ఈ కాన్ఫిడెన్స్ తో ఎన్టీఆర్ సినిమాను త్రివిక్రమ్ ఏ రేంజ్ లో తెరకెక్కిస్తాడో..?