అదేం స్టేట్మెంట్ అనుకుంటున్నారా..? ఆల్రెడీ చెప్పాడుగా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మగాడు కాదని.. తానెప్పుడూ మగాన్నే ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటానని చెప్పాడుగా..! మన నిజ జీవితం గురించి కాదు మాట్లాడుకునేది భరత్ అనే నేను సినిమా గురించి. ఈ ట్రైలర్ లో మరోసారి మగ తనం గురించి మాట్లాడాడు మహేశ్ బాబు. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు ఆకాశమంత ఎత్తులో ఉన్నాయి. ఇప్పుడు జర్నీ ఆఫ్ భరత్ చూసిన తర్వాత ఈ అంచనాలు మరింత పెరిగాయి. ట్రైలర్ కే జర్నీ ఆఫ్ భరత్ అనే పేరు పెట్టాడు కొరటాల. సిఎం అంటే ఎలా ఉండాలి..? ప‌్రజలకు న్యాయం చేసేలా ఉండాలి. వాళ్ల కష్టాలు తీర్చేలా ఉండాలి.. అయ్యా అంటే ఆదుకునేలా ఉండాలి. ఈ లక్షణాలన్నీ ఇప్పుడు కొరటాల తెరకెక్కిస్తోన్న భరత్ లో కనిపిస్తున్నాయి.
తన ముఖ్యమంత్రి ఎలా ఉన్నాడో.. ఉండబోతున్నాడో ప్రేక్షకులకు పరిచయం చేసాడు ఈ దర్శకుడు. రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో వాళ్లు వాడే విజన్.. జర్నీ ఆఫ్ భరత్.. ఓత్ లాంటి పదాల్నే వాడుకుంటున్నాడు కొరటాల. పల్లెలే దేశా నికి పట్టుకొమ్మలు అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాడు కొరటాల. ఫ్యాక్షనిజం వద్దని మిర్చిలో.. గ్రామదత్తత అంటూ శ్రీమంతుడులో.. మొక్కల్ని నాటండి అంటూ జనతా గ్యారేజ్ లో చెప్పిన కొరటాల.. ఈ సారి ప్రతీ మనిషికి భయం బాధ్యత ఉండాలంటున్నాడు. అవి లేకపోతే మనిషి కాదంటున్నాడు. ఎంత కష్టమొచ్చినా ఇచ్చిన మాట కోసం నిలబడేవాడే మనిషి అంటూ ఇందులో సందేశాన్ని నింపి భరత్ అనే నేనును ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు కొరటాల శివ. దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి తన ఆర్ఆర్ తో మాయ చేసాడు. ఎప్రిల్ 8న ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఎప్రిల్ 20న ఈ సినిమా విడుదల కానుంది.