భరత్ అనే నేనులో మహేశ్ తో పాటు ఇంకా చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. కానీ ఒక్కరు మాత్రం సీన్ లో కనిపించట్లేదు. ఆయనే శరత్ కుమార్. అసలు ఈయన సినిమాలో ఉన్నాడా అనే అనుమానం రావచ్చు. కానీ షూటింగ్ టైమ్ లోనే శరత్ కుమార్ ఉన్నాడని తెలిసింది. ఈయన ఫోటోకు దండేసి గోడెక్కించాడు కొరటాల.
అంటే సినిమాలో మహేశ్ తండ్రిగా శరత్ కుమార్ నటిస్తున్నారని అర్థమైంది. కానీ ఇప్పటి వరకు ట్రైలర్ లో కానీ.. టీజర్ లో కానీ.. స్టిల్స్ లో కానీ ఎక్కడా శరత్ కుమార్ జాడ కనిపించలేదు. అసలు ఈయన సినిమాలో ఉన్నాడా.. లేదంటే కేవలం ఫోటోను మాత్రమే వాడుకుంటున్నాడా.. అదీ కాదంటే శరత్ కుమార్ ఉన్నా దాచేస్తున్నారా..
అనేది అర్థం కావడం లేదు. కొరటాలకు ప్రతీ సినిమాలోనూ హీరో కాకుండా మరో స్ట్రాంగ్ కారెక్టర్ రాసుకోవడం అలవాటు. మిర్చిలో సత్యరాజ్..
శ్రీమంతుడులో జగపతిబాబు.. జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్.. ఇలా ప్రతీ సినిమాలో ఉన్నారు. ఇప్పుడు భరత్ అనే నేనులో శరత్ కుమార్ ఉన్నాడని అంతా అనుకున్నారు. కానీ ఈ కారెక్టర్ ను కొరటాల శివ ఎందుకు దాచేస్తున్నారో అర్థం కావట్లేదు. అసలు ఈయన సస్పెన్స్ ఏంటో సినిమా విడుదలయ్యేంత వరకు కూడా అర్థం కాదేమో..? ఎప్రిల్ 20న భరత్ అనే నేను విడుదల కానుంది.