ఎట్టకేలకు ఒక్కడొచ్చాడు రాజకీయ నాయకుడు అనుకున్నాం.. కాదు నాయకుడు అంటూ భరత్ అనే నేనులో డైలాగ్ రాసాడు కొరటాల. ఇప్పుడు ఇదే డైలాగ్ ఈయనకు కూడా బాగా సూట్ అవుతుంది. చాలా మంది దర్శకుల్లాగే ఇంకొక్కడు వచ్చాడనుకున్నారు ప్రేక్షకులు కానీ కాదు దార్శనీకుడు వచ్చాడు.
అంటే పదిమంది దర్శకులకు స్పూర్థి రగిలించేవాడన్నమాట. ఒక్క హిట్ కొట్టడానికే ఈ రోజుల్లో నానా తంటాలు పడుతున్నారు దర్శకులు. అలాంటిది వరసగా విజయాలు అందుకోవడం అంటే చిన్న విషయం కాదు. అది కూడా అందరూ స్టార్ హీరోలతోనే.. భారీ బడ్జెట్ సినిమాలతోనే.. విజయం అందుకోడం.. అంచనాలు అందుకోవడం అంటే అంతకంటే పెద్ద రిస్క్ అంటే మరోటి ఉండదు. రాజమౌళి మాత్రమే ఆ అంచనాలు అందుకుని..
ప్రతీ సినిమాతో గెలుపు తలుపు తడుతున్నాడు. ఇప్పుడు మళ్లీ ఆ స్థాయి సక్సెస్ స్ట్రీక్ సాగిస్తున్న దర్శకుడు కొరటాల శివ. తొలి సినిమా నుంచి ఇదే చేస్తున్నాడు కొరటాల.
మిర్చి నుంచే తన సత్తా చూపిస్తున్నాడు ఈ దర్శకుడు. రైటర్ నుంచి దర్శకుడు అయిన కొరటాల.. కథ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. ప్రతీ సినిమాలోనూ కమర్షియల్ అంశాలతో పాటు సందేశం కూడా ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. అందుకే అన్ని సినిమాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. మిర్చి కానీ.. శ్రీమంతుడు కానీ.. జనతా గ్యారేజ్ కానీ ఆయా సమయానికి ఆ హీరోల కెరీర్స్ లో పెద్ద విజయాలు.
మహేశ్, ఎన్టీఆర్ కు ఇప్పటికీ అవే. ఇప్పుడు భరత్ అనే నేనుతో వరసగా నాలుగోసారి కూడా ప్రేక్షకులను మెప్పించేసాడు కొరటాల శివ. ఈ సినిమాకు కూడా టాక్ బాగుంది. ఇందులో మరోసారి తను చెప్పాలనుకున్నది సూటిగా సుత్తి లేకుండా చెప్పాడు. ఓ రాష్ట్రానికి సిఎం ఎలా ఉండాలో చూపించాడు ఈ దర్శకుడు. ఇలా కానీ ఉంటే అద్భుతాలు చేయొచ్చని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపించాడు. మొత్తానికి కొరటాల విన్నింగ్ స్ట్రీక్ చూస్తుంటే రాజమౌళి గుర్తొస్తున్నాడు.