సరిగ్గా ఏడాది కింద పవన్ గురించి మాట్లాడమంటే చెప్పను బ్రదర్ అంటూ కామెంట్ చేసి అభిమానుల కోపానికి గురయ్యాడు అల్లుఅర్జున్. వరసగా రెండు విజయాలు వచ్చేసరికి బన్నీ తానేదో మెగాస్టార్ లా ఫీల్ అవుతున్నాడంటూ మెగా ఫ్యాన్సే విమర్శించారు. ఇక అప్పట్లో ఈ విషయంపై చిరు కూడా పిలిచి బన్నీకి క్లాస్ పీకాడని వార్తలు వినిపించాయి.
ఇవన్నీ పక్కనబెడితే ఇప్పుడు బన్నీలో చాలా మార్పు వచ్చింది. అది ఎందుకొచ్చిందో తెలియదు కానీ మార్పు అయితే బాగా గట్టిగా వచ్చింది. ఆ మారిన మనిషి మనకు నా పేరు సూర్య ఆడియో వేడుకలో కనిపించాడు. ఇదివరకు అడిగినా కూడా పవన్ గురించి మాట్లాడని బన్నీ.. ఇప్పుడు అడక్కపోయినా అక్కడున్న వాళ్లకు పవన్ గురించి చెప్పాడు. నెం.1 హీరో అయ్యుండి.. కోట్ల డబ్బు వదిలేసి..
విలాసవంతమైన జీవితాన్ని పక్కనబెట్టి కేవలం జనం కోసం పవన్ రాజకీయాల్లోకి వచ్చాడని చెప్పాడు స్టైలిష్ స్టార్. అలాంటి వ్యక్తిపై కావాలనే కొందరు బురద జల్లుతున్నారని.. ఎవరెన్ని చేసినా పవన్ కచ్చితంగా సత్తా చూపిస్తారని చెప్పాడు అల్లుఅర్జున్. ఆయన మంచి వాడని.. ఆయన కష్టం, నిజాయితే బలమని చెప్పాడు ఈ హీరో. ఇక బయట ఎవరెన్ని మాట్లాడుకున్నా.. మెగా కుటుంబం అంతా ఒక్కటే అని మరో సారి గుర్తు చేసాడు బన్నీ. అది తెలియాల్సినపుడు అందరికీ తెలుస్తుందని.. మళ్లీ మళ్లీ చెప్పాల్సిన పనిలేదని చెప్పాడు ఈ హీరో.
ఇదంతా చూస్తుంటే మెగా కుటుంబంతో అల్లు వారబ్బాయికి మళ్లీ బంధాలు బాగా బలపడినట్లుగా అర్థమవుతుంది. ఇక చివర్లో రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్నందుకు రామ్ చరణ్ కు కంగ్రాట్స్ చెప్పాడు అల్లుఅర్జున్.