అదేంటి.. ఆచారి అమెరికా యాత్ర కదా.. నవ్వుల యాత్ర ఏంటి అనుకుంటున్నారా..? ఈ సినిమాలో ఎమోషన్స్ ఎలా ఉన్నా.. సెంటిమెంట్స్ ఎలా ఉన్నా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేది మాత్రం కచ్చితంగా కామెడీనే. ఎందుకంటే మరోసారి పూర్తిస్థాయి కామెడీ ఎంటర్ టైనర్ తోనే వస్తున్నాడు విష్ణు. విష్ణు హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఎప్పుడో జనవరిలోనే విడుదల కావాల్సి ఉంది.
కానీ అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. ఇన్నాళ్ల తర్వాత దానికి మోక్షం వస్తుంది. జనవరి 26 నుంచి ఏకంగా ఎప్రిల్ 27కి పోస్ట్ పోన్ అయింది ఆచారి అమెరికా యాత్ర. అదేరోజు సాయిపల్లవి కణం సినిమా కూడా విడుదల కానుంది. ఎప్రిల్ 27 కానీ మిస్ అయితే మరో మూడు నెలల వరకు ముహూర్తాలు కూడా లేవు.
దాంతో పోటీ అయినా పర్లేదని బరిలో దిగుతున్నాడు మంచు వారసుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు రెస్పాన్స్ బాగానే వచ్చింది.
ట్రైలర్ చూస్తుంటేనే సినిమా ఎంత కామెడీగా ఉండబోతుందో అర్థమైపోతుంది. తెలిసిన కథే అయినా కూడా కడుపులు చెక్కలయ్యే కామెడీ కన్ఫర్మ్ అని తెలిసిపోతుంది. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఆడోరకం ఈడోరకం.. దేనికైనా రెడీ లాంటి హిట్స్ తర్వాత విష్ణుతో నాగేశ్వరరెడ్డి చేసిన సినిమా ఇది.
ఇందులో బ్రహ్మానందం ఆచారి పాత్రలో నటించాడు. ఆయన్ని నమ్మించి అమె రికా తీసుకెళ్లి.. అక్కడ ఎలాంటి తిప్పలు పెట్టారనేది అసలు కథ. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రహ్మానందం కెరీర్ మళ్లీ గాడిన పడాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే..! ఆ అద్భుతం ఇదే అవుతుందని ఆశిస్తున్నాడు బ్రహ్మి. దేనికైనా రెడీ కూడా బ్రాహ్మణ కథతోనే వచ్చింది. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు విష్ణు. మరి చూడాలిక..
అప్పుడు కలిసొచ్చినట్లు కూడా ఇప్పుడు కూడా కలిసొస్తుందేమో..? మరి చూడాలిక.. విష్ణును ఆచారి అయినా ఫామ్ లోకి తీసుకొస్తాడో లేదో..?