అవును.. సావిత్రి, ఎన్టీఆర్ అంటే అప్పట్లో సూపర్ హిట్ జోడీ. వీళ్లు అన్నాచెల్లెళ్లుగా నటించినా.. భార్యాభర్తలుగా కనిపించినా బాక్సాఫీస్ షేక్ అయిపోయేది. అంతగా సావిత్రి, ఎన్టీఆర్ కాంబినేషన్ కు పేరుంది. ఇక ఏఎన్నార్ తోనూ అంతే. ఇప్పుడు మహానటి అంటూ సావిత్రి బయోపిక్ ను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్.
దీనికి ఇటు అక్కినేని.. అటు నందమూరి హీరోల సపోర్ట్ తీసుకుంటున్నాడు. ఈ చిత్రంలో నాగేశ్వరరావ్ గా నాగచైతన్య నటించాడు. ఇక ఎన్టీఆర్ పాత్ర మాత్రం డిజిటలైజ్ చేసారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ చిత్ర ఆడియో వేడుక మే 1న హైదరాబాద్ లో జరగనుంది. దీనికి ముఖ్యఅతిథిగా ఎన్టీఆర్ వస్తున్నాడు. సావిత్రి కోసం ఈ నాటి ఎన్టీఆర్ కదులుతున్నాడు. దీనికి కారణం కూడా లేకపోలేదు.
ఈ చిత్ర నిర్మాతలు ప్రియాంక దత్ తో ఎన్టీఆర్ కు సాన్నిహిత్యం ఉంది. అశ్వినీదత్ కు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. అప్పట్లో వీళ్ళ తాత ఎన్టీఆర్ చేతులమీదుగా లాంచ్ అయిన తన బ్యానర్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉందని భావిస్తుంటాడు అశ్వినీదత్. అందుకే ఇప్పుడు సావిత్రి లాంటి మహానటి బయోపిక్ ఆడియో వేడుకకు సరైన అతిథి ఎన్టీఆరే అని భావిస్తున్నారు చిత్రయూనిట్. అందుకే వాళ్లు అడగ్గానే యంగ్ టైగర్ కూడా మరే పని పెట్టుకోకుండా సావిత్రి కోసం వచ్చేస్తున్నాడు. మరి చూడాలిక.. నాటి సావిత్రి, ఎన్టీఆర్ కాంబినేషన్ బ్లాక్ బస్టర్.. మరి నేటి కాంబినేషన్ ఎలా ఉండబోతుందో..?