ఊళ్లలో ఓ పదం ఉంటుంది.. కాస్త గొప్పలకు పోతుంటే అరేయ్ వీడు ఫేకుతున్నాడ్రా అంటారు. అంటే ఉట్టి మాటలు చెబుతున్నాడని అర్థం. ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ఇదే జరుగుతుందనే అనుమానం ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. లేకపోతే మరేంటి..? ఇన్నాళ్లూ కలెక్షన్లు ఎంత వచ్చాయంటే నిర్మాతలు చెప్పినంత అనుకునేవాళ్లు కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి. 10 కోట్లు 13 కోట్లు చెప్పడం ఓ లెక్క.. కానీ 10 కోట్లు వస్తే ఏకంగా 20 కోట్లు వచ్చాయని చెప్పుకోవడం మాత్రం అంత మంచిది కాదేమో అంటున్నారు ప్రేక్షకులు. ఇప్పుడు ఇదే జరుగుతుంది మరి. ఏ ఒక్క సినిమాకో అంటే ఏమో అనుకోవచ్చు కానీ ఇప్పుడు ప్రతీ సినిమాకు ఇలా ఫేక్ కలెక్షన్లు చెప్పడం అలవాటైపోయింది. తాజాగా విడుదలైన నా పేరు సూర్య మూడు రోజుల్లోనే 87 కోట్లు వసూలు చేసిందంటూ పోస్టర్ విడుదల చేసారు.
87 కోట్ల గ్రాస్ అంటే షేర్ కనీసం 52 కోట్లు వచ్చుండాలి కదా.. కానీ ఇప్పుడు అంత వచ్చిందా అంటే మాత్రం నో అనే సమాధానమే వస్తుంది. అంతా కొడితే మూడు రోజుల్లో ఈ చిత్రం వసూలు చేసింది 60 కోట్ల గ్రాస్.. 37 కోట్ల షేర్. కానీ మూడు రోజుల్లోనే తమ సినిమా 87 కోట్లు వచ్చిందంటూ పోస్టర్ విడుదల చేసుకున్నారు దర్శక నిర్మాతలు. మొన్న భరత్ అనే నేను విషయంలోనూ ఇదే జరిగింది. ఈ చిత్రం రెండు రోజుల్లోనే 100 కోట్లు వచ్చాయంటూ పోస్టర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. కానీ 4 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ అందుకుంది భరత్ అనే నేను. కానీ ఆ తొందర తాలలేక ఎలాగైనా వచ్చే వసూళ్లే కదా అని రెండు రోజుల్లోనే తమ సినిమా సెంచరీ కొట్టేసిందని పోస్టర్లు విడుదల చేసారు. ఇక తొలివారంలోనే 161 కోట్ల గ్రాస్ అంటూ నిర్మాత విడుదల చేసిన పోస్టర్ పేద్ద సంచలనమే రేపింది.
ఆ విమర్శలు తట్టుకోలేక మళ్లీ 125 కోట్ల పోస్టర్ విడుదల చేసారు. కానీ రెండు వారాలకు 190 కోట్లంటూ మరో పోస్టర్ విడుదల చేసి తాను ఇంకా మరాలేదని నిరూపించుకున్నాడు నిర్మాత దానయ్య. ఇప్పుడు ఈ ఫేక్ రికార్డుల గోలతో అసలైన రికార్డులు కూడా చెరిగి పోతున్నాయి. నిజానికి భరత్ అనే నేను అద్భుతమైన వసూళ్లు సాధించింది. ఈ చిత్రం ఇప్పటి వరకు 90 కోట్ల షేర్ దాటేసింది. అంటే దాదాపు 150 కోట్లకు పైగానే గ్రాస్ అన్నమాట. వచ్చింది సుబ్బరంగా చూపించుకోవచ్చు కదా.. అనవసరంగా 40 కోట్లు ఎక్కువేసుకుని ఎందుకు ప్రేక్షకులను పిచ్చోళ్లను చేయడం అంటున్నారు విశ్లేషకులు. అప్పుడు భరత్.. ఇప్పుడు నా పేరు సూర్య.. పెద్దగా తేడా లేదు. యావరేజ్ సినిమాను బ్లాక్ బస్టర్ అన్నారు.. ఇప్పుడు ఫ్లాప్ అయ్యే సినిమాను కూడా 100 కోట్ల క్లబ్ లో జాయిన్ చేస్తున్నారు.. అంతే..!