మహానటి.. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ప్రతీచోట ఈ పేరు బాగా వినిపిస్తుంది. ఎప్పుడో 37 ఏళ్ల కింద చనిపోయిన ఓ నటిని ఇంకా గుర్తు పెట్టుకుని.. ఆమెనే మహానటిగా కీర్తించడం అనేది చిన్న విషయం కాదు. ఆ రోజుల్లో సావిత్రితో పాటు ఇంకా చాలా మంది నటీమణులు ఉన్నారు.
కానీ వాళ్లెవరు ఈ రోజు ప్రేక్షకులకు ఇంతగా గుర్తు లేరు. కానీ సావిత్రి మాత్రం ప్రతీ తెలుగు వాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. నిజానికి ఈ తరానికి సావిత్రి అంటే ఎవరో తెలియదు.. ఆమె ఎలా ఉండేదో తెలియదు.. ఎలా బతికిందో తెలియదు.. ఎలా చనిపోయిందో అంతకంటే తెలియదు. కానీ ఆమె గురించి తెలుసుకోవాలనే తపన మాత్రం అందర్లోనూ ఉంది. దానికి కారణం ఆమె జీవితంలో అన్ని సుడిగుండాలు..
ఆటుపోట్లతో పాటు ఎత్తుపల్లాలు కూడా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మహానటిలో అవన్నీ చూపించబోతున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. మే 9 కోసం అందుకే ప్రేక్షకులు ఆసక్తిగా కళ్లలో ఒత్తులేసుకుని మరీ వేచి చూస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మళయాల ఇండస్ట్రీల్లోనూ మహానటి భారీగా విడుదల కానుంది. ఎందుకంటే ఈ నటి కేవలం తెలుగుకే కాదు.. అన్ని ఇండస్ట్రీల్లోనూ సుపరిచితురాలే. పైగా తమిళ ఇండస్ట్రీకి ఈమె ఆడపడుచు.
జెమినీ గణేషన్ ను పెళ్లి చేసుకుని.. తమిళనాడు కోడలైంది సావిత్రి. ఓవర్సీస్ లోనే 150 లొకేషన్స్ లో విడుదలవుతుంది మహానటి. మే 8 రాత్రి నుంచే షోలు పడుతున్నాయి. అన్ని భాషల్లో కలిపి దాదాపు 1000 థియేటర్స్ లో విడుదలవుతుంది మహానటి. మరి చూడాలిక.. నాగ్ అశ్విన్ మూడేళ్ల కష్టానికి ప్రతిఫలం ఎలా ఉండ బోతుందో..?