నాని ఆ ప‌నులు మొద‌లుపెట్టాడు..


ఇప్పుడు నాని ఎదుగుతున్న తీరు చూస్తుంటే త్వ‌ర‌లోనే చాలా మంది స్టార్ హీరోల‌కు ఈయ‌న నుంచి గండం త‌ప్ప‌ద‌ని తెలుస్తుంది. వ‌ర‌స‌గా 8 విజ‌యాల‌తో జోరు మీదున్న నానికి ఈ మ‌ధ్యే కృష్ణార్జున యుద్ధం బ్రేకులేసింది. అయినా ఏం ప‌ర్లేదు మ‌ళ్లీ వ‌ర‌స‌గా వ‌చ్చేస్తున్నాడు. ఇకిప్పుడు ఈయ‌న చూపు టీవీపై కూడా ప‌డుతుంది. త్వ‌ర‌లోనే ఈయ‌న హోస్ట్ గా రాబోతున్నాడు. అది కూడా బిగ్ బాస్ సీజ‌న్ 2తో. అవును..
నానికి ఇప్పుడు హోస్ట్ గా మారే ఆఫ‌ర్ వ‌చ్చింది. బిగ్ బాస్.. తెలుగు రియాలిటీ షోస్ లో ఓ సంచ‌ల‌నం. అస‌లు తెలుగులో ఇంత‌గా ఈ షో చూస్తార‌ని స్టార్ మా కూడా అనుకుని ఉండ‌రు. తెలుగులో రియాలిటీ షో చూస్తార‌ని.. అది ఇంత విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కం అయితే ముందు ఎవ‌రికీ లేదు. కానీ ఎన్టీఆర్ మాయ చేసాడు. ఆయ‌న క్రేజ్ బిగ్ బాస్ ని ఎక్క‌డికో తీసుకెళ్లిపోయింది.
తొలి సీజ‌న్ అయిపోయిన త‌ర్వాత కూడా ఎవ‌రికీ రెండో సీజ‌న్ ఎవ‌రు చేస్తారు అనే అనుమానం రాలేదు. ఎందుకంటే ఎన్టీఆర్ అని అంతా ఫిక్స్ అయిపోయారు కాబ‌ట్టి. కానీ ఇప్పుడు అలా జ‌ర‌గ‌డం లేదు. త్రివిక్ర‌మ్, రాజ‌మౌళి సినిమాల‌తో ఎన్టీఆర్ బిజీగా ఉండ‌టంతో ఇప్పుడు బిగ్ బాస్ 2 నుంచి ఎన్టీఆర్ త‌ప్పుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి.
దాంతో ఇప్పుడు అంద‌రి దృష్టి రెండో సీజ‌న్ పై ప‌డింది. ఆ సీజ‌న్ కు హోస్ట్ ఎవ‌రు..? ఎన్టీఆర్ ప‌క్క‌కు వెళ్లిపోవ‌డంతో ఆ స్థాయిలో షోను హోస్ట్ చేసే హీరో ఎవ‌రు అని వెతుకుతున్నారు ఇప్పుడు స్టార్ మా యాజ‌మాన్యం. ఎన్టీఆర్ కాకుండా మ‌రో హోస్ట్ వ‌స్తే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారా..? ఇప్పుడు ఇలా ప్రేక్ష‌కుల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి.
బిగ్ బాస్ రెండో సీజ‌న్ కోసం చాలా మంది పేర్లు వినిపించినా కూడా చివ‌రికి నానిని ఫైన‌ల్ చేసారు. ఏడాదికి నాలుగు సినిమాలు చేసే నాని.. అది వదిలేసి బిగ్ బాస్ వైపు వ‌స్తాడా అనుకున్నారు కానీ ఇప్పుడు ఆయ‌నే వ‌చ్చేస్తున్నాడు. బిగ్ బాస్ సీజ‌న్ 2 కోసం అప్పుడే కాల్షీట్స్ కూడా ఇచ్చేసాడు న్యాచుర‌ల్ స్టార్. ఇప్ప‌టికే గ‌తేడాది ఐఫాలో రానాతో క‌లిసి హోస్ట్ గా ర‌ప్ఫాడించాడు న్యాచుర‌ల్ స్టార్. పైగా ఇండ‌స్ట్రీకి రాక‌ముందు రేడియోజాకీగా ప‌నిచేసిన అనుభ‌వం నాని సొంతం.
అన్నింటికీ మించి నానిలో తెలియ‌ని ఫ‌న్ చాలా ఉంటుంది. అదంతా బిగ్ బాస్ 2కు హెల్ప్ కానుంద‌ని భావిస్తుంది స్టార్ యాజ‌మాన్యం. కానీ జ‌నం ఎన్టీఆర్ కు అలవాటు ప‌డిన త‌ర్వాత అత‌న్ని మ‌రిపించే స్థాయిలో నాని చేస్తాడా అనేది ఆస‌క్తిక‌ర‌మే. అలా చేస్తే చిరంజీవి మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడులా అయితే అస‌లుకే మోసం వ‌స్తుంది..! చూడాలిక‌.. ఏం చేస్తారో.. బిగ్ బాస్ 2లో నాని ఏం చేస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here