ఏ సినిమాను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయలేం. మహానటిని చూసి ముందు అంతా ప్రశంసల వరకే పరిమితం అవుతుంది.. కమర్షియల్ గా ఈ చిత్రం వర్కవుట్ అవ్వడం కష్టం అన్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా దెబ్బకు పెద్ద సినిమాలు కూడా అబ్బా అంటున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే అమ్మ దెబ్బకు కొందరికి బ్యాండ్ బాజా అయిపోయింది. మహానటి వచ్చిన తర్వాత నా పేరు సూర్య పూర్తిగా కనిపించకుండా పోయింది.
ఇప్పుడు ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్లు చూస్తుంటే దిమ్మతిరిగిపోతుంది. తొలిరోజే హాఫ్ మిలియన్ మార్క్ అందుకుంది ఈ చిత్రం. వీకెండ్ ముగిసే సరికి ఈజీగా మహానటి 1.3 మిలియన్ వసూలు చేస్తుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికీ చాలా స్ట్రాంగ్ గా కలెక్షన్లు ఉండటం కలిసొచ్చే అంశం. పైగా సినిమా కూడా అద్భుతంగా ఉండటం.. సావిత్రి జీవితం కావడం.. తెలుగు వాళ్లకు బాగా కనెక్ట్ అయ్యే కథ కావడంతో మహానటికి ఎదురులేకుండా పోయింది. ఈ చిత్రం కచ్చితంగా ఓవర్సీస్ లో 2 మిలియన్ మార్క్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇదే జరిగితే అమ్మ అద్భుతం చేసినట్లే. మరో వైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా మహానటి బాగానే వసూలు చేస్తుంది. తొలిరోజు కోటిన్నరతో సరిపెట్టుకున్న సావిత్రమ్మ.. రెండో రోజు 2.5 కోట్ల వరకు తీసుకొచ్చింది. అంటే కోటి రూపాయలు ఎక్కువన్నమాట. ఇదే జోరు తర్వాత రోజుల్లో కూడా కొనసాగేలా కనిపిస్తుంది. ఇక మే 11న మహానటి తమిళ్లో విడుదల కానుంది. అక్కడ కూడా ఇదే రిజల్ట్ వస్తుందని నమ్ముతున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్.