సినిమా ఇండస్ట్రీలో అంతే. ఇక్కడ ఎన్ని విజయాలు వచ్చాయని కాదు.. ఎలాంటి టైమ్ లో ఫ్లాప్ వచ్చింది అనేది ముఖ్యం. కావాలంటే సాక్ష్యం కింద మేర్లపాక గాంధీని చూపించండి. వరసగా రెండు విజయాలతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు ఈ కుర్రాడు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్.. ఎక్స్ ప్రెస్ రాజాతో టాలీవుడ్ లోకి దూసుకొచ్చాడు. ఇక మూడో సినిమాకు ఏకంగా ఎనిమిది విజయాలతో జోరుమీదున్న నాని దొరకడంతో హ్యాట్రిక్ ఖాయం అనే అంతా అనుకున్నారు.
కానీ కృష్ణార్జునయుద్ధం ఎవరూ ఊహించని విధంగా డిజాస్టర్ అయింది. దాంతో గాంధీ ఆశలన్నీ అడియాశలయ్యాయి. దానికి తోడు నాని జోరుకు కూడా బ్రేకులు పడ్డాయి. కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్ అయిన తీరు చూసి ఇప్పుడు గాంధీ వైపు చూడ్డమే మానేసారు హీరోలు. దాంతో మనోడి పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. కృష్ణార్జున యుద్ధం వచ్చి నెల రోజులు దాటేసినా కూడా ఇప్పటికీ మేర్లపాక జాడ కనిపించడం లేదు. ఈ చిత్రం ఫ్లాప్ కావడంతో నెక్ట్స్ హీరో కోసం వెతుకులాడుకుంటున్నాడు ఈ కుర్ర దర్శకుడు. మరో హిట్ కొడితే తప్ప మేర్లపాక మళ్లీ సీన్ లో కనిపించడం కష్టమే. మరి చూడాలిక.. ఆ అద్భుతం ఎప్పుడు జరుగుతుందో..?