ఎలా ఉండే దర్శకుడు.. ఎలా అయిపోయాడే అంటూ ఇప్పుడు పూరీ జగన్నాథ్ ను చూసి బాధ పడుతున్నారు అభిమానులు. ఒకప్పుడు ఈయన నుంచి సినిమా వస్తుందంటే కచ్చితంగా హిట్ అనే నమ్మకం ఉండేది.. కనీసం యావరేజ్ అయినా ఉంటుంది.. డైలాగులైనా ఎంజాయ్ చేసి రావచ్చులే అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు.. పూరీ సినిమా అంటే వెళ్లడమే వేస్ట్ అంటున్నారు ప్రేక్షకులు. అంతగా దిగజారిపోయింది ఈయన ఇమేజ్.
పూరీ ఒక్కో అడుగు వెనక్కి వేస్తుంటే.. ఆయన అభిమానులు కూడా తగ్గిపోతున్నారు. అసలు ఈయన ఎందుకు ఇలా మారిపోయాడో..? ఒకప్పుడు అలాంటి సినిమాలు చేసిన దర్శకుడి నుంచి ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఎందుకు వస్తున్నాయో తెలియక జుట్టు పీక్కుంటున్నారు ఫ్యాన్స్. ఇక ఇప్పుడు కొడుకు ఆకాశ్ తో చేసిన మెహబూబా కూడా ఇలాగే తయారైంది. ఈ చిత్రం కూడా డిజాస్టర్ అయిపోయింది. వచ్చిన మూడు రోజుల్లో కనీసం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేక చేతులెత్తేసింది ఈ చిత్రం. పునర్జన్మల కాన్సెప్ట్ తీసుకున్నపుడు..
దాన్ని సరిగ్గా డీల్ చేస్తే ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. కానీ ఏదో సీన్ పేపర్ వేసుకుని.. ఐడియా రాగానే షూటింగ్ పూర్తి చేసినట్లుగా ఉంది ఈ చిత్రం. ఎక్కడా హైలైట్ అనిపించే పాయింట్స్ లేక.. చివరికి రొటీన్ స్క్రీన్ ప్లేకు బలైపోయింది మెహబూబా. అసలు ఇప్పుడు ఏం చేస్తే పూరీ ఈ మత్తులోంచి బయట పడతాడో అర్థం కావడం లేదు అభిమానులకు కూడా. ఈయన నుంచి ఇప్పుడు మంచి సినిమా అవసరం లేదు.. కనీసం వచ్చినట్లు గుర్తించే సినిమా వచ్చినా చాలంటున్నారు. మరి చూడాలిక.. పూరీ ఏం చేస్తాడో..?