ప్రతీ ఏడాది సమ్మర్ లో ఒక్క బ్లాక్ బస్టర్ వస్తేనే గాల్లో గంతులేస్తారు దర్శక నిర్మాతలు కానీ ఈ సారి మాత్రం రెండు బ్లాక్ బస్టర్లు.. ఓ భారీ సినిమా పడింది. దాంతో 2018 సమ్మర్ నిలిచిపోయింది. స్టార్ హీరోలు తమ బాధ్యత నిర్వర్తించారు. ముందుగా ఈ సమ్మర్ ను ఓ ప్రదంగా మొదలు పెట్టింది రామ్ చరణే. ఈయన నటించిన రంగస్థలం మార్చ్ 30న విడుదలైంది.
50 రోజుల్లో ఏకంగా 126 కోట్ల షేర్.. 210 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం. ఇప్పటి వరకు బాహుబలికి మాత్రమే సాధ్యమైన కొన్ని రికార్డులను చరణ్ కూడా అందుకున్నాడు. ఇక రంగస్థలం తర్వాత సమ్మర్ లో మరో మంచి సినిమా భరత్ అనే నేను. ఈ చిత్రం కూడా దాదాపు 95 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇంత చేసినా కూడా ఇది హిట్ కాదు. ఎందుకంటే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎక్కువగా జరగడం వల్ల.
అయితే రెండు ఫ్లాపుల తర్వాత మహేశ్ కు వచ్చిన చాలా మంచి సినిమా ఇది. కొరటాల ఈ చిత్రంతో నాల్గో సారి ప్రేక్షకుల మెప్పు పొందాడు.
భరత్ అనే నేను తర్వాత భారీ అంచనాలతో వచ్చిన నా పేరు సూర్య అంచనాలు అందుకోలేకపోయింది. ఈ చిత్రం బన్నీ కెరీర్ లో చాలా ఏళ్ల తర్వాత డిజాస్టర్ అయింది. 80 కోట్ల బిజినెస్ చేస్తే వచ్చింది కేవలం 50 కోట్లే. ఇక నాని కృష్ణార్జున యుద్ధం.. నితిన్ చల్ మోహన్ రంగా లాంటి సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.
ఇలాంటి టైమ్ లో వచ్చిన మహానటి బాక్సాఫీస్ ను శాసిస్తుంది. సావిత్రి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటి వరకు 14 రోజుల్లో 33 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఇప్పటికీ కలెక్షన్లు తగ్గడం లేదు. మహా నటి దూకుడు చూస్తుంటే మూడో వారాంతంలోనే 40 కోట్ల మార్క్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇంతా చేస్తే ఈ చిత్రాన్ని అమ్మింది కేవలం 20 కోట్లకే. అంటే ఇప్పటికే 13 కోట్లు అదనంగా వచ్చేసాయి. దానికితోడు రైట్స్ బోనస్. ఇంకా ఈ సమ్మర్ లో నేలటిక్కెట్టు.. ఆఫీసర్.. నా నువ్వే లాంటి సినిమాలున్నాయి. మొత్తానికి ఈ సమ్మర్ ఆశాజనకంగానే ఉంది ఇండస్ట్రీకి. ఇదే ఊపు కొనసాగితే 2018 సమ్మర్ చరిత్రలో నిలిచిపోనుంది.