అప్పుడెప్పుడో రెండు నెలల కిందే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా ఇప్పటికీ రాలేదు. భారీ బడ్జెట్ తో కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ తో సిద్ధమవుతున్న సినిమా ప్రేక్షకులను పలకరించలేదు. వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా వస్తోన్న సినిమా ఎప్పుడొస్తుందో తెలియదు. అదే మణికర్ణిక.
మన తెలుగు దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కంగన రనౌత్ హీరోయిన్ గా వస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. శాతకర్ణి తెరకెక్కించాడన్న నమ్మకంతో ఈ చిత్రాన్ని క్రిష్ కు అప్పగించింది కంగన. అనుకున్నట్లుగానే త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసాడు ఈ దర్శకుడు. కానీ విడుదల మాత్రం అనుకున్నంత త్వరగా కావడం లేదు.
ఇప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ లోనే సినిమా ఉంది. అదెప్పటికి పూర్తవుతుందో కూడా క్లారిటీ రావడం లేదు. అందుకే షూటింగ్ పూర్తై చాలా రోజులవుతున్నా కూడా మణికర్ణికపై క్రిష్ కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు. ఎప్రిల్ 27నే రావాల్సిన ఈ చిత్రం నెల రోజులు ఆలస్యం అయినా విడుదల తేదీ కూడా కన్ఫర్మ్ చేసుకోలేదు. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో ఊహించడం కూడా కష్టమే. మరి చూడాలిక.. చివరికి ఈ మణికర్ణిక ఎప్పుడొస్తుందో..? అన్నట్లు ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందించడం విశేషం.