అదేంటి.. అల్లరోన్ని పట్టుకుని అంత మాట అనేసారేంటి అనుకుంటున్నారా..? ఇది మనం అంటున్న మాటేం కాదండీ బాబూ.. భీమినేని శ్రీనివాస రావ్ అంటున్న మాట. అల్లరోడు ఒక్కడే కాదు.. సునీల్ కూడా సిల్లీఫెల్లోనే. ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు ఓ సినిమాలో నటిస్తున్నారు. సుడిగాడు 2 అనుకున్నారు ఈ చిత్రాన్ని ఇన్నాళ్లూ. కానీ ఇప్పుడు ఈ చిత్రానికి సిల్లీఫెల్లోస్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు.
ఇప్పటికే షూటింగ్ చివరిదశకు వచ్చింది. తొట్టిగ్యాంగ్ తర్వాత సునీల్, అల్లరి నరేష్ మెయిన్ లీడ్ చేస్తోన్న సినిమా ఇదే. మరోవైపు ఇప్పుడు ఇద్దరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నరేష్ పరిస్థితి అయితే మరీనూ..! ఏ టైమ్ లో సుడిగాడు చేసాడో కానీ అప్పట్నుంచి నరేష్ కెరీర్ లో సుడి లేకుండా పోయింది. ఆ సినిమా వరకే సుడి పనిచేసింది. ఆ తర్వాత అన్నీ ఫ్లాపులే కానీ ఒక్క హిట్ కూడా లేదు. ఐదేళ్లైంది ఇప్పటి వరకు ఒక్క సినిమా హిట్ కాలేదు. 2012లో వచ్చిన సుడిగాడు తర్వాత ఇప్పటి వరకు మరో విజయం లేదు ఈ కుర్ర హీరోకు.
మరో రాజేంద్ర ప్రసాద్ అవుతాడనుకుంటే.. ఎటు వెళ్తుందో తెలియని గమ్యం వైపు నరేష్ కెరీర్ వెళ్తుందిప్పుడు. ఈయన కెరీర్ తీరం తెలియని నావలా.. చుక్కాని లేని పడవలా మారిపోయిందిప్పుడు. ఇలాంటి పరిస్థితుల్లో తన కెరీర్ ఎక్కడైతే ఆగిపోయిందో.. అక్కడే మళ్లీ మొదలు పెడుతున్నాడు అల్లరోడు. సిల్లీఫెల్లోస్ పైనే అల్లరోడి ఆశలన్నీ ఇప్పుడు ఉన్నాయి. ఇక అల్లరి నరేష్ ప్రస్తుతం హీరోగానే కాకుండా కారెక్టర్ ఆర్టిస్ట్ గానూ మారిపోయాడు. మహేశ్ బాబు-వంశీ పైడిపల్లి సినిమాలో అల్లరి నరేష్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. మరి చూడాలిక.. ఈ సిల్లీఫెల్లో ఇప్పుడు ఏం చేస్తాడో..?