అంతే మరి.. రజినీకాంత్ అయినా కూడా ఇప్పుడు సినిమా బాగుంటేనే చూస్తున్నారు. సూపర్ స్టార్ ఉన్నాడు కదా అని ఎగేసుకుని థియేటర్ కు వెళ్లే రోజులు పోయాయి. దానికి కాలాకు వస్తున్న ఓపెనింగ్సే సాక్ష్యం. ఈ చిత్రానికి కేవలం 3 కోట్ల వసూళ్లు వచ్చాయి తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు. ఈ కలెక్షన్లే చెబుతాయి సినిమా రేంజ్ ఏంటి అని. ఇదిలా ఉంటే ఈ వారం కూడా నెమ్మదిగా మహానటి ఖాతాలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ చిత్రం వచ్చి ఇప్పటికే ఐదు వారాలు అయిపోయింది. కానీ ఇప్పటికీ థియేటర్స్ లోంచి సినిమాను తీయడం లేదు. కారణం ఇప్పటికీ షేర్స్ వస్తూనే ఉన్నాయి కాబట్టి.
గతవారం అభిమన్యుడు నుంచి భారీ పోటీ ఎదుర్కొన్నా కూడా కలెక్షన్లు మాత్రం బాగానే రాబట్టింది. ఇక ఈ వారమైతే పూర్తిగా మళ్లీ మహానటి వచ్చేలా కనిపిస్తుంది. కాలాకు జోల పాడటం ఖాయమైపోయింది. మహానటి విడుదలైన ముహూర్తం ఏంటో కానీ ఆ తర్వాత దీనికి పోటీగా వచ్చిన ప్రతీ సినిమా కూడా చేతులెత్తేస్తుంది. కొన్ని వారాలుగా బాక్సాఫీస్ దగ్గర దీని జోరు తట్టుకునే సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు. వచ్చిన సినిమాలన్నీ అలా వెళ్లిపోతున్నాయంతే.
అభిమన్యుడు మినహా నా పేరు సూర్య.. మెహబూబా.. నేలటికెట్.. అమ్మమ్మగారిల్లు.. ఆఫీసర్.. రాజుగాడు.. కాలా ఇలా అన్నీ మహానటి ముందు తోకముడిచాయి. పైగా ఇప్పటికీ సినిమాకు ప్రమోషన్ ఆపడం లేదు చిత్రయూనిట్. ప్రతీ వారం ఏదో ఓ మేకింగ్ వీడియో.. డిలీటెడ్ సీన్ విడుదల చేస్తూ సినిమాపై ఆసక్తి పెంచేస్తున్నారు. ఇప్పటికే 41 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. సావిత్రి బతికి ఉన్నపుడు చివరి రోజుల్లో తన దగ్గర ఏమీ లేనపుడు కూడా సాయం చేసింది. ఇప్పుడు ఆమె చనిపోయిన 37 ఏళ్ల తర్వాత కూడా తన జీవితంతో ఏడేళ్లుగా కష్టాల్లో ఉన్న అశ్వినీదత్ ను నష్టాల్లోంచి.. కష్టాల్లోంచి బయట పడేసింది. మొత్తానికి అప్పుడు ఇప్పుడూ సావిత్రి అంటే దానానికి మారుపేరే.