అదితిరావ్ హైద్రీ.. ఈ పేరు గుర్తు పెట్టుకోండి. త్వరలోనే కచ్చితంగా ఈ పేరు తెలుగులోనూ పాపులర్ అవుతుంది. ఎందుకంటే తొలి సినిమాతోనే అలా పేరు తెచ్చుకుంటుంది మరి. సమ్మోహనంగా ఆకర్షిస్తూ.. స్టార్ హీరోయిన్ అయిపోయే అన్ని లక్షణాలు తనలో ఉన్నాయని నిరూపించుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఇన్నాళ్లూ ఈ పేరుకు తెలుగులో తక్కువ గుర్తింపు ఉంది కానీ త్వరలోనే ఈ భామ ఇమేజ్ అలా పెరిగిపోయే రోజు దగ్గర్లోనే ఉంది. హైద్రాబాద్ నుంచే ముంబైకి వెళ్లింది అదితిరావ్ హద్రీ. అక్కడే సెటిల్ కావడంతో సొంత ఇండస్ట్రీని అస్సలు పట్టించుకోలేదు అదితి. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ పిలిచి అవకాశాలు ఇస్తుండటంతో బాలీవుడ్ ను కాదని ఇక్కడికి వస్తుంది ఈ భామ. సమ్మోహనంలో సొంత డబ్బింగ్ కూడా చెప్పుకుంది అదితి.
పైగా ఇప్పుడు సినిమాలో ఈమె వాయిస్ కు కూడా మంచి మార్కులే పడటంతో అదితిపై కన్నేసి ఉంచుతున్నారు దర్శక నిర్మాతలంతా. కేవలం నటనే కాదు.. అందాల ఆరబోతలో కూడా అమ్మాయిగారికి అస్సలు అడ్డంకులు లేవు. కాకపోతే సమ్మోహనంలో అలాంటి పాత్ర కాబట్టి ఆ వైపు వెళ్లలేదంతే. ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ కు జోడీగా నటిస్తుంది అదితి. మరి చూడాలిక.. ఈ ముద్దుగుమ్మ రచ్చ తెలుగు ఇండస్ట్రీలో ఎలా ఉండబోతుందో..?