ఇండస్ట్రీలో మంచి సినిమాలు తీస్తామంటే ఆ దర్శకులను ఎవరూ నమ్మరు. మంచితో పాటు కమర్షియల్ గా కూడా కావాలంటారు. తప్పేం లేదు.. ఇది బిజినెస్ కాబట్టి పేరుతో పాటు డబ్బులు కూడా రావాలి. అందుకే మంచి సినిమాలు చేసే చంద్రశేఖర్ యేలేటి లాంటి దర్శకులకు ఇండస్ట్రీలో ఎప్పుడూ కష్టాలు తప్పవు. ఈయన చేసిన ఏ ఒక్క సినిమా కూడా ఇప్పటి వరకు చెడ్డ సినిమా అనిపించుకోలేదు.
అన్నీ మంచి సినిమాలే.. కానీ ఆడవంతే. గత సినిమా మనమంతా కూడా చాలా బాగుందనే టాక్ తెచ్చుకుంది. కానీ కమర్షియల్ గా మాత్రం ఆడలేదు. ఇప్పుడు ఈయన తర్వాతి సినిమా కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. సాయిధరంతేజ్ తో సినిమా ఉంటుందనే ప్రచారం జరిగినా కూడా ఎందుకో కానీ అది ఆగిపోయింది. ఆ తర్వాత గోపీచంద్ తో ఆ సినిమా చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు.
కానీ అది కూడా ఆగిపోవడంతో ఇప్పుడు అదే కథను నితిన్ తో చేయడానికి సన్నాహాలు చేసుకుంటు న్నాడు చంద్రశేఖర్ యేలేటి. ప్రస్తుతం ఈయన వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. శ్రీనివాస కళ్యాణం తర్వాత హరీష్ శంకర్ తో దాగుడు మూతలు.. వెంకీ కుడుములతో ఓ సినిమా చేయబోతున్నాడు. మరి ఇవన్నీ అయ్యేంత వరకు చంద్రశేఖర్ యేలేటి వేచి చూస్తూనే ఉంటాడేమో చూడాలిక..!