తరుణ్ అంటే ఇక్కడ పాత హీరో తరుణ్ కాదు..! అసలే ఆ మధ్య డ్రగ్స్ కేసులో మనోడి పేరు ఎక్కువగా వినిపించింది కదా..! మళ్లీ అదే తరుణ్ అనే ఊహల్లో ఉంటే కష్టం. ఇక్కడ తరుణ్ అంటే దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులుతో ఈయన ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డాడు.
కానీ రెండో సినిమా కోసం రెండేళ్లుగా వెయిట్ చేయిస్తూనే ఉన్నాడు ప్రేక్షకుల్ని. ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది అంటూ వస్తున్నాడు. జూన్ 29న విడుదల కానుంది ఈ చిత్రం. అంతా కొత్త వాళ్ళతో ఈయన చేస్తోన్న ఈ సినిమాతో కచ్చితంగా తను మరో హిట్ కొడతానని ధీమాగా చెబుతున్నాడు తరుణ్ భాస్కర్.
అసలే టాలీవుడ్ లో ద్వితీయ విఘ్నం దాటిన దర్శకులు చాలా తక్కువ మంది. రాజమౌళి.. బోయపాటి.. కొరటాల.. అనిల్ రావిపూడి లాంటి అతికొద్ది మంది దర్శకులు మాత్రమే ద్వితీయ విఘ్నాన్ని దాటారు. అంటే రెండో సినిమాతో మెప్పించారన్నమాట. తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి రెండో సినిమాకే చాప చుట్టేసిన దర్శకులు ఎంతోమందున్నారు మన ఇండస్ట్రీలో. అలాంటి వాళ్ల జాబితాలో తాను లేనంటున్నాడు తరుణ్. సురేష్ బాబు ఈ నగరానికి ఏమైంది చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
ఇది కూడా పూర్తిగా కామెడీ ఎంటర్ టైనర్. ట్రైలర్ లోనే కడుపులు చెక్కలు చేయిస్తున్నాడు దర్శకుడు. కాకపోతే కాస్త థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా దొంగతనం బ్యాక్ డ్రాప్ లో సినిమా వస్తుంది. హాలీవుడ్ క్రైమ్ కామెడీ హ్యాంగోవర్ స్పూర్థితో ఈ చిత్రం తరుణ్ భాస్కర్ తెరకెక్కించాడని తెలుస్తుంది. మరి చూడాలిక.. ఈ చిత్రంతో తరుణ్ ఏం మాయ చేస్తాడో..?