నాగశౌర్య.. ఈ పేరుకు మొన్నటి వరకు ఉన్న ఇమేజ్ వేరు.. ఇప్పుడు ఉన్న ఇమేజ్ వేరు. ఒక్క సినిమాతో ఇండస్ట్రీలో లెక్కలు మారిపోతుంటాయి. ఇప్పుడు నాగశౌర్య విషయంలోనూ ఇదే జరిగింది. ఈయన ఛలో సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. 2018లో తొలి బ్లాక్ బస్టర్ ఇదే. ఈ సినిమా తర్వాత నాగశౌర్య మార్కెట్ కూడా బాగానే పెరిగిపోయింది. అయితే కణంతో పాటు అమ్మమ్మగారిల్లు ఫ్లాపులతో మనోడు మళ్లీ వెనకబడి పోయాడు. కానీ సినిమాల విషయంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు శౌర్య. ఈ మధ్యే సొంత బ్యానర్ లో నర్తనశాల సినిమాను మొదలుపెట్టాడు శౌర్య. ఈ సినిమాతో శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడు.
ఈ సినిమాతో పాటు తాజాగా ఇప్పుడు భవ్య క్రియేషన్స్ లో ఓ సినిమా మొదలుపెట్టాడు శౌర్య. రాజా కొలస ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఎప్పుడో పట్టాలెక్కాల్సిన ఈ చిత్రం శౌర్య పారితోషికం కారణంగా కాస్త ఆలస్యంగా మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం కోసం ఏకంగా 4 కోట్ల పారితోషికం శౌర్య అడిగేసరికి నిర్మాతకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఒక్క హిట్ తోనే నాలుగు కోట్లు పారితోషికం అంటే కష్టమే. ఎందుకంటే శౌర్య సినిమాల్లో ఇప్పటి వరకు ఛలో మాత్రమే 12 కోట్ల మార్క్ అందుకుంది.
దాని బడ్జెట్ 6 కోట్లే. కానీ ఇప్పుడు హీరోకే 4 కోట్లిస్తే బడ్జెట్ 10 కోట్లవుతుంది. అంటే కచ్చితంగా 15 కోట్లు వసూలు చేయాలి సినిమా. ఇదంతా వర్కవుట్ అవుతుందా..? ఎక్కడ చిన్న తేడా కొట్టినా కూడా నిర్మాతలకు నష్టాలు తప్పవు. అందుకే రెమ్యునరేషన్ విషయంలో శౌర్య కాస్త తగ్గితే బెటర్ అని సూచనలు వెళ్తున్నాయి ఆయనకు. అనుకున్నట్లుగానే శౌర్య తగ్గాడు.. సినిమా మొదలైందనే వాదన వినిపిస్తుంది. మరి ఈ కొత్త దర్శకులు శౌర్య కెరీర్ ను ఎటువైపుకు తీసుకెళ్తారో చూడాలిక..!