కొత్త దర్శకులకు చాలా కృతజ్ఞత ఉంటుందంటారు.. వాళ్లు ఎవరేం మేలు చేసినా అంత త్వరగా మరిచిపోరు అంటారు. వాళ్ల కెరీర్ కు ఉపయోగపడ్డ వాళ్లను గుర్తించుకుంటారు. కానీ తరుణ్ భాస్కర్ కూడా ఒక్క సినిమాతోనే మారిపోయాడు. ఈయనకు ఇప్పుడు గతం అస్సలు గుర్తు లేదు. పెళ్లి చూపులు సినిమా టైమ్ లో అసలు తరుణ్ ఎవరో ఎవరికీ తెలియదు. అలా తెలిసేలా చేసింది.. చెప్పింది మీడియానే. చిన్న సినిమా..
చాలాబాగుంది కొత్త దర్శకుడు అద్భుతంగా తీసాడంటూ విడుదలకు పది రోజుల ముందు నుంచే మీడియాలో పెళ్లిచూపులును ప్రమోట్ చేసారు. రివ్యూలు కూడా అద్భుతంగా రాసారు. కానీ అవేవీ ఇప్పుడు ఈ దర్శకుడికి గుర్తు లేదు. ఈ నగరానికి ఏమైందిపై కాస్త మిక్స్ డ్ రివ్యూస్ ఇచ్చారని.. తెలుగులో ఏ ఒక్కడికి కూడా రివ్యూ రాసే అర్హతే లేదని తేల్చేసాడు తరుణ్. ఇక్కడ ఎవరికి సినిమాల గురించి అవగాహన లేదని.. రివ్యూ రైటర్స్ అనేవాళ్లకు రాసే అర్హత ఉండాలి.. దానికోసం ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్స్ ఒకటి చేయాలని చెప్పాడు తరుణ్ భాస్కర్.
చెత్త రివ్యూలు రాస్తున్నారని విమర్శించాడు. మరి అదే చెత్త రివ్యూ రైటర్లే కదా పెళ్లిచూపులు సినిమాను బాగుందని రాసింది. అంటే అప్పుడు కూడా అన్నీ అబద్ధాలే చెప్పారా రివ్యూ రైటర్లు. అప్పుడు అద్భుతంగా అనిపించిన వాళ్లు ఇప్పుడు ఎందుకు చేదు అవుతున్నారు. నువ్వు తీసిన సినిమాలో కంటెంట్ ఎలా ఉందో చూసుకోకుండా రాసిన వాడిపై కత్తి దూయడం ఎందుకు అంటున్నారు తరుణ్ ను ఇప్పుడంతా.
పెళ్లిచూపులు యూనిక్ కంటెంట్ తో వచ్చింది.. కానీ ఈ నగరానికి ఏమైంది కుర్రాళ్లను టార్గెట్ చేసాడు.. వాళ్లకు కనెక్ట్ అయింది. ఇంత చిన్న లాజిక్ మరిచిపోయి.. ప్రతీ సినిమాకు పాజిటివ్ రివ్యూలు రాయాలంటే ఎలా..? మరి ఈ కుర్ర దర్శకుడికి ఇవన్నీ ఎప్పటికీ అలవాటు అవుతాయో చూడాలిక..!