ఇదేదో పూరీ జగన్నాథ్ కొత్త సినిమా టైటిల్ కాదు.. ఇప్పుడు ఆయనకు మిగిలి ఉన్న ఆప్షన్. ఇన్నాళ్లూ కథలు సిద్ధం చేసుకని బయటి హీరోలను మెప్పించాల్సి వచ్చేది. వాళ్లు ఒప్పుకోకపోతే ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఇంట్లోనే హీరోను సిద్ధం చేసుకుంటున్నాడు పూరీ. ఆకాశ్ ను ఎలాగైనా స్టార్ గా నిలబెట్టాలని కలలు కంటున్నాడు ఈ దర్శకుడు. ఇప్పటికే ఈ కుర్రహీరోతో చేసిన మెహబూబా డిజాస్టర్ గా నిలిచింది.
అయితే కొడుకు కెరీర్ కు గట్టి పునాది వేయాలని చూస్తున్నాడు పూరీ. అది చేసే వరకు నిద్రపోయేలా కనిపించట్లేదు. ప్రస్తుతం మరో కథ కొడుకు కోసమే రెడీ చేసాడు పూరీ. ఈ సారి పునర్జన్మలు లాంటివి కాకుండా పక్కా కమర్షియల్ స్క్రిప్ట్ సిద్ధం చేసాడు. మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండేలా కథ రాసి..
మసాలా సినిమా చేయాలని ఫిక్సైపోయాడు. ఆగస్ట్ నుంచే ఈ చిత్రం పట్టాలెక్కనుంది కూడా. ఈ సినిమాతో తను కూడా ఫామ్ లోకి వచ్చి స్టార్స్ కు మళ్లీ తన సత్తా చూపించాలని ఆశ పడుతున్నాడు. మరి తనయుడి కెరీర్ తో పాటు తన కెరీర్ ను కూడా సెట్ చేసుకుంటాడో లేదో చూడాలిక..!