మన దర్శకులు బాగా ఎదిగిపోయారు. సినిమాలో హీరోనే కావాల్సిన పనిలేదు.. కథే హీరో అంటారు అనే ఫార్మాట్ ను ఇప్పుడు ఫాలో అవుతున్నారు. ఈ ఫార్మాట్ లోనే రాజమౌళి ఈగను పెట్టి సినిమా తీసాడు.. అంతకుముందు గోదావరిలో కుక్కను పెట్టి సినిమా చేసాడు శేఖర్ కమ్ముల..
గతంలో పొట్టేలును పెట్టి ఓ సినిమా చేసాడు సీనియర్ దర్శకుడు రామనారాయణ. ఇలా జంతువుల్ని, పక్షుల్ని వాడుకోవడం మన దర్శకులు ఎప్పట్నుంచో మొదలుపెట్టిన పనే. ఇక ఇప్పుడు దీనికి కొనసాగింపుగా రవిబాబు కూడా పందిపిల్లను పెట్టి సినిమా తీస్తున్నాడు. అవును.. నచ్చావులే.. నువ్విలా.. ఇలాంటి విభిన్నమైన ప్రయత్నాలు చేసిన రవిబాబు.. ఇప్పుడు అదిగో అనే సినిమా చేస్తున్నాడు.
అయితే ఈ చిత్రం మొదలుపెట్టి రెండేళ్లు దాటినా ఇప్పటి వరకు బయటికి రాలేదు. ఇంకా షూటింగ్ నడుస్తూనే ఉంది. ఆ సినిమాను ప్రమోట్ చేయలేక నానా తంటాలు పడుతున్నాడు రవిబాబు. ఈ మధ్యే పందిపిల్లను వీపుపై పెట్టుకుని డిప్స్ కూడా కొట్టాడు ఈ దర్శకుడు. ఇందులో హీరో హీరోయిన్లతో పాటు పందిపిల్ల కూడా కీలకపాత్రలో నటించనుంది. తెల్లటి పందిపిల్లతో రవిబాబు ఇచ్చిన పోజు భలే విచిత్రంగా అనిపిస్తుంది ఇప్పుడు.
ఇండస్ట్రీలో ఈ సినిమా గురించి టాపిక్ నడుస్తుంది. గతంలో తన సినిమాలను కుక్కపిల్లలు, ఏనుగులతో పబ్లిసిటీ చేసుకున్నాడు రవిబాబు. ఇప్పుడు ఏకంగా పందిపిల్లతో సినిమా చేయబోతున్నాడు. అయితే ఇది ఎప్పుడు విడుదలవుతుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.