మొన్నటి వరకు శ్రీనివాస కళ్యాణంపై తెలుగు రాష్ట్రాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి కానీ ఓవర్సీస్ లో మాత్రం అంతగా లేవు. అక్కడ కారణం ఏంటో తెలియదు కానీ ఈ చిత్రాన్ని ఊహించిన రేట్ కు తీసుకోడానికి ఎవరూ ముందుకు రాలేదు. అయితే దిల్ రాజు మాత్రం అస్సలు తగ్గలేదు.
ఇప్పుడు టీజర్ తో పాటు పాటలు కూడా విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దాంతో అప్పుడు వద్దనుకున్న వాళ్లే ఇప్పుడు మళ్లీ రారా అంటూ పిలుస్తున్నారు. అన్నట్లు ఓవర్సీస్ హక్కుల్ని ప్రముఖ సంస్థ 3 కోట్లకు కొన్నట్లు తెలుస్తుంది. నితిన్ లాంటి హీరోకు ఇది చాలా ఎక్కువ. ఎందుకంటే ఈయన కెరీర్ లో అ..ఆ మాత్రమే అక్కడ అద్భుతాలు చేసింది.
అది కూడా త్రివిక్రమ్ క్రేజ్ తో. కానీ ఇప్పుడు అ..ఆ తర్వాత అంత భారీ రేట్ పెట్టి తీసుకుంటున్న సినిమా శ్రీనివాస కళ్యాణమే. లై.. ఛల్ మోహన్ రంగా సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచినా కూడా సతీష్ వేగేశ్న.. దిల్ రాజు బ్రాండ్ తో శ్రీనివాస కళ్యాణం అక్కడ కూడా భారీ రేట్ కు అమ్ముడైంది. కచ్చితంగా ఈ చిత్రం విదేశాల్లో అదరగొడుతుందని నమ్ముతున్నాడు దిల్ రాజు. 3 కోట్లను వెనక్కి తీసుకురావడం అంటే మాటలు కాదు..
కచ్చితంగా ఈ చిత్రంతో మిలియన్ డాలర్స్ వసూలు చేస్తే కానీ నితిన్ సినిమా సేఫ్ కానట్లే. శతమానం భవతి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సతీశ్ వేగేశ్న నుంచి వస్తోన్న సినిమా కావడంతో కచ్చితంగా శ్రీనివాస కళ్యాణంకు వసూళ్ల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తుంది. ఆగస్ట్ 9న విడుదల అవుతుంటే.. 8న భారీగా ప్రీమియర్స్ వేస్తున్నారు.