రాజకీయం అంటే సినిమా అనుకుంటున్నారు మన హీరోలు. అందుకే అక్కడా ఇక్కడా ఒకే స్ట్రాటజీతో ముందుకెళ్లాలని చూస్తున్నారు. లేకపోతే మరేంటి..? ఇక్కడ ఏళ్లకేళ్లు కష్టపడితే కానీ ఒక్క ఎమ్మెల్యే సీట్ రావడం లేదు. అలాంటిది అప్పటికప్పుడు పార్టీలు పెట్టేసి.. అప్పటికప్పుడు ముఖ్యమంత్రులు అయిపోదాం అంటే ఎలా..? అసలు అది సాధ్యమయ్యే పనేనా..? కానీ తాము తలుచుకుంటే కానిది అంటూ ఏదీ లేదనుకుంటున్నారు హీరోలు.
కావాలంటే కమల్ హాసన్ నే తీసుకోండి. మొన్నటి వరకు ఈయన సినిమాలు కాదు.. రాజకీయాలు చేస్తానన్నాడు. భారతీయుడు 2 తర్వాత ఇక తాను సినిమాలకు గుడ్ బై చెప్పేసి హాయిగా రాజకీయాల్లోనే బిజీ అయిపోతానన్నాడు. కానీ అంతలోనే ఈయనకు పురుగు కుట్టేసింది.
తాను బతికున్నంత వరకు నటిస్తూనే ఉంటానంటూ మరో స్టేట్ మెంట్ పాస్ చేసాడు అప్పుడే. పార్టీ పనులతో పాటు తన సినిమాలను కూడా చూసుకుంటానంటున్నాడు. ఓ వైపు సినిమాలు.. మరోవైపు రాజకీయం చేయడానికి ఇదేమైనా స్క్రిప్ట్ కాదు కదా..? ఇంత చిన్న లాజిక్ మన హీరోలకు ఎందుకు అర్థం కావడం లేదో మరి..?
కమల్ మాత్రమే కాదు.. రజినీకాంత్ కూడా అటు సినిమాలు.. ఇటు రాజకీయాలు అంటున్నాడు. ఈయన కూడా ఇంకా కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావడం లేదు. మరి ఈ ఇద్దరికి క్లారిటీ వచ్చేది ఏనాటికో..? మరోవైపు ఎన్నికలు చూస్తుంటే ఏడాది కూడా లేవు. మొత్తానికి అరవ రాజకీయాలు అర్థం కావంటే ఏమో అనుకుంటాం కానీ వీళ్లిద్దరని చూస్తుంటే మాత్రం అవును అనిపిస్తుంది.