ఎన్నో అంచనాలు.. మరెంతో ఆసక్తి మధ్య శ్రీనివాస కళ్యాణం విడుదలైంది. అయితే తొలిరోజు టాక్ మాత్రం ఊహించని విధంగా యావరేజ్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అసలు విడుదలకు ముందు ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వస్తుందని అనుకోలేదు ఎవరూ. కానీ అలా జరిగిపోయింది. పెళ్లి గొప్పతనం గురించి చెబుతూ.. తెలుగింటి బంధాలు అనుబంధాల గురించి అందంగా చెప్పి తెరపై కన్నుల పండగగా ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేసాడు దర్శకుడు.
అయితే ఫస్టాఫ్ లో విషయం తక్కువగా ఉండటంతో అసలుకే మోసం వచ్చేసింది. చాలా చోట్ల సినిమా సీరియల్ లా నెమ్మదిగా సాగడం శ్రీనివాస కళ్యాణంకు మైనస్ గా మారింది. లై.. ఛల్ మోహన్ రంగా డిజాస్టర్స్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో నితిన్ కూడా శ్రీనివాస కళ్యాణంపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమాకు వచ్చిన టాక్ ఇప్పుడు నితిన్ కు షాకే. ఈ టాక్ తో సినిమా 30 కోట్లు కలెక్ట్ చేస్తుందా అనేది ఇప్పుడు అసలు అనుమానం. కుటుంబ ప్రేక్షకుల చలువతో ఓపెనింగ్స్ వరకు అయితే ఏ ఢోకా లేదు కానీ ఆ తర్వాత అసలు సీన్ తెలియనుంది.