అదేంటి.. మొన్నటి వరకు మీడియా ముందే కదా ఉన్నాడు.. అప్పుడే తప్పిపోవడం ఏంటి అనుకుంటున్నారా..? అవును.. నా పేరు సూర్యతో ఏకంగా బన్నీ లాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు ఈ రైటర్. కానీ దాన్ని ఉపయోగించుకోవడంలో మాత్రం పూర్తిగా విఫలం అయ్యాడు.
బన్నీకి ఏడేళ్ల తర్వాత వచ్చిన డిజాస్టర్ ఇది. 80 కోట్ల బిజినెస్ చేసి 50 కోట్లు మాత్రమే వసూలు చేసింది నా పేరు సూర్య. ఈ సినిమా తర్వాత పూర్తిగా కనిపించడం మానేసాడు వక్కంతం వంశీ. ఆ సినిమా హిట్ అయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది కానీ ఇప్పుడు మళ్లీ తనను తాను నిరూపించుకోవాల్సిన పనిలో పడ్డాడు వంశీ. దాంతో ఈయన రెండో సినిమాపై అందరి ఆసక్తి ఉంది. నా పేరు సూర్య ఫలితం చూసిన తర్వాత ఏ హీరో అయినా వంశీకి ఆఫర్ ఇచ్చే దైర్యం చేస్తాడా అనేది అసలు అనుమానం. కచ్చితంగా ఇప్పట్లో వక్కంతం మళ్లీ మెగాఫోన్ పట్టడం కష్టమే.
ఈయన రెండో సినిమా కోసం మరోసారి పోరాటం మొదలుపెట్టాల్సిందే. స్టార్ హీరోల కంటే చిన్న హీరోలను నమ్ముకుంటే పని అవుతుందని సలహాలు కూడా వంశీకి వెళ్తున్నాయి. అయితే ఇన్ని కష్టాల మధ్య కూడా రవితేజ ఇతన్ని నమ్మాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యే మాస్ రాజాను కలిసి వక్కంతం కథ చెప్పాడనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం శీనువైట్లతో అమర్ అక్బర్ ఆంటోనీ.. సంతోష్ శ్రీనివాస్ తో తెరీ రీమేక్.. విఐ ఆనంద్ తో డిస్కోరాజా సినిమాలు చేస్తున్నాడు రవితేజ. అంతా ఫ్లాప్ దర్శకులతోనే. ఇక ఇప్పుడు మరోసారి ఫ్లాప్ డైరెక్టర్ నే నమ్ముకుంటాడా అనేది చూడాలిక..!