అప్పుడెప్పుడో పదేళ్ల కింద దొంగల బండి సినిమాతో దర్శకుడిగా మారిన సతీష్ వేగేశ్న.. ఆ తర్వాత చాలా సినిమాలకు కథ మాటలు అందించాడు. అయితే కోరుకున్న గుర్తింపు మాత్రం ఎప్పుడూ రాలేదు. 2017లో శర్వానంద్ హీరోగా వచ్చిన శతమానంభవతి సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు సతీష్ వేగేశ్న. ఈ చిత్రంతో ఏకంగా నేషనల్ అవార్డు అందుకున్నాడు. దానికి తోడు కమర్షియల్ గా కూడా శతమానం భవతి సంచలన విజయం సాధించింది. దాంతో ఇండస్ట్రీ మొత్తం సతీష్ వేగేశ్న పేరు మారుమోగి పోయింది. వెంటనే శ్రీనివాస కళ్యాణం మరోసారి కుటుంబ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సతీష్ వేగేశ్న.
నితిన్ హీరోగా వచ్చిన ఈ చిత్రం ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. దాంతో మళ్లీ భారీ గ్యాప్ తీసుకున్న సతీష్ ఇప్పుడు ఆల్ ఈజ్ వెల్ అంటూ ఒక కథ సిద్ధం చేసుకున్నాడు. ఇందులో ఒక కుర్ర హీరో నటించబోతున్నాడని తెలుస్తోంది. అయితే ఆయన ఎవరు అనేది మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. దర్శకుడి దృష్టిలో మాత్రం రామ్, నాని, శర్వానంద్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరికి కథ చెప్పి ఒప్పించాలని చూస్తున్నాడు సతీష్ వేగేశ్న. ఆదిత్య మ్యూజిక్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. తెలుగులో నిర్మించబోయే తొలి సినిమా ఇదే. మొత్తానికి శ్రీనివాస కళ్యాణం ఫ్లాప్ కావడంతో ఇప్పుడు హిట్ కొట్టి మళ్ళీ ఆల్ ఈజ్ వెల్ అనిపించుకోవాలని చూస్తున్నాడు సతీష్ వేగేశ్న. మరి ఈయన కోరిక ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి.