ఇది సినిమా ఇండస్ట్రీ.. ఇక్కడ ఒకరికి వచ్చిన ఐడియా మరొకరికి రాకుండా ఉండాలని లేదు. క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఒక ఐడియా ఒకేసారి ఇద్దరికి కూడా వస్తుంది. ఇప్పుడు రవితేజ, సమంత సినిమాలు తెరకెక్కిస్తున్న దర్శకులకు కూడా ఇదే జరిగింది. ప్రస్తుతం వీరు నటిస్తున్న సినిమాలు ఒకే కథతో తెరకెక్కుతున్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రవితేజ డిస్కోరాజా సినిమాలో నటిస్తున్నాడు.
ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్కక్షణం లాంటి విభిన్న చిత్రాలు తెరకెక్కించిన వి.ఐ.ఆనంద్ దీనికి దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయింది. ప్రయోగాత్మకంగా ఉండే ఈ చిత్రాన్ని రవితేజ ఇమేజ్ కు సరిపోయేలా వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో రవితేజ ఒక ప్రయోగం ద్వారా వృద్ధాప్యం నుంచి యవ్వనంలోకి వస్తాడు. అది ఎలా అనేది సినిమా సినిమాలో చూసి తెలుసుకోవాలి అంటున్నాడు దర్శకుడు ఆనంద్. ఇక సమంత, నందినీరెడ్డి కాంబినేషన్లో రాబోయే మిస్ గ్రానీ సినిమా కూడా ఇలాంటి కథతోనే వస్తుంది.
కొరియన్ సినిమాకు రీమేక్ గా వస్తున్న మిస్ గ్రానీ కథను తెలుగు ప్రేక్షకుల అభిరుచి తగ్గట్లు మార్చింది నందినీరెడ్డి. ఇందులో కూడా 70 ఏళ్ల బామ్మ పాతికేళ్ల యవ్వనంలోకి ఎలా వస్తుంది అనేది కథ. కచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని ధీమాగా చెబుతోంది నందిని రెడ్డి. మొత్తానికి అటు రవితేజ.. ఇటు సమంత ఇద్దరూ ఒకే తరహా కథల్ని చేస్తున్నారు. మరి వీటిలో ఏది ప్రేక్షకులను అలరిస్తుందనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.