నాలుగేళ్లుగా సినిమాలు చేయని దర్శకుడితో సినిమా అన్నపుడే సూర్యకు ఏమైనా పిచ్చి పట్టిందా అనుకున్నారంతా. సెల్వ రాఘవన్ సినిమా అంటే ఒకప్పుడు అంచనాలు భారీగా ఉండేవి కానీ కొన్నేళ్లుగా ఆయన నుంచి ఒక్క మంచి సినిమా కూడా రాలేదు. ఆయన చివరి సినిమా వర్ణ అయితే పిచ్చెక్కిపోతుంది చూస్తే. ఏం చెప్పాలనుకున్నాడో.. ఏం తీయానుకున్నాడో కూడా క్లారిటీ ఉండదు. పైగా 50 కోట్ల బడ్జెట్ పెట్టించి మొత్తం నాశనం చేసాడు. ఇలాంటి టైమ్ లో సెల్వతో సినిమా అంటే అంతా దూరంగానే ఉన్నారు. కానీ సూర్య మాత్రం ఈయన చెప్పిన కథ నచ్చి ఎన్ జి కే చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. విడుదలైన పోస్టర్స్ చూస్తుంటేనే సినిమాలో ఏదో ఉందని అర్థమైపోతుంది. యువ తరహాలో స్టూడెంట్ పాలిటిక్స్ చుట్టూ ఈ కథ నడుస్తుందని తెలుస్తుంది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా ఈ చిత్ర టీజర్ విడుదల కానుంది. ఐదు భాషల్లో ఎన్జికే టీజర్ విడుదల చేస్తున్నాడు సూర్య.
సాయిపల్లవి, రకుల్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దివాళికి రావాల్సిన ఈ చిత్రం ఇంకా రాలేదు. ఇప్పుడు ఎప్పుడొస్తుందో కూడా క్లారిటీ లేనంతగా పడిపోయింది. ఆ మధ్య హ్యాపీ దివాళి.. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ పోస్టర్స్ ఇచ్చాడు కానీ సినిమా విడుదలపై క్లారిటీ ఇవ్వలేదు. సెల్వకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో అనుకున్న దానికంటే షూటింగ్ నెమ్మదిగా జరుగుతుంది. పైగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆలస్యం అవుతుంది. దాంతో ఎన్జికే విడుదలపై సస్పెన్స్ కొనసాగుతుంది. అసలు ఈ ఏడాది వస్తుందా అనేది కూడా అనుమానమే. అసలే వరస ఫ్లాపుల్లో ఉన్న సూర్యకు ఈ స్ట్రోక్ లేటెస్ట్ అన్నమాట. మొత్తానికి ఈ చిత్రం గురించి వదిలేసి హాయిగా కేవీ ఆనంద్ సినిమాతో బిజీగా ఉన్నాడు ఈ హీరో. మరి నందగోపాల కుమరన్ ఎప్పుడొస్తాడో ఏంటో..?