వెంకటేశ్ సినిమాకు నితిన్ తో సంబంధం ఏంటి..? ఈ ఇద్దరూ కలిసి మల్టీస్టారర్ చేస్తున్నారా అనుకుంటున్నారా..? ఇక్కడ వెంకీ అంటే వెంకటేష్ కాదు.. వెంకీ కుడుముల. ఛలో సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు వెంకీ కుడుముల. గతేడాది తొలి బ్లాక్ బస్టర్ ఇచ్చింది ఈ దర్శకుడే. ఛలోతో హిట్ కొట్టాడు. ఇప్పుడు రెండో సినిమాను నితిన్ తో ప్లాన్ చేసుకుంటున్నాడు.
లై.. ఛల్ మోహన్ రంగా.. శ్రీనివాస కళ్యాణం హ్యాట్రిక్ ఫ్లాపుల తర్వాత ఈ హీరో వెంకీని నమ్ముకుంటున్నాడు. శ్రీనివాస కళ్యాణం తన కెరీర్ కు ఊపిరి పోస్తుందని నమ్మాడు కానీ అది కూడా ఉన్న ఉసురు తీసేసింది. దాంతో ఇప్పుడు ఈయన ఆశలన్నీ వెంకీ సినిమాపైనే ఉన్నాయి. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్. ఈ సినిమా డిసెంబర్ లోనే పట్టాలెక్కాల్సి ఉన్నా కూడా ఇప్పుడు ఆలస్యమైంది.
జనవరిలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. దీనికి భీష్మ టైటిల్ కన్ఫర్మ్ చేసారు. సింగిల్ ఫర్ ఎవర్ అనేది ట్యాగ్ లైన్. పెళ్లికి దూరంగా ఉండాలనుకునే ఓ యువకుడి కథ ఇది. అలాంటి వాడి లైఫ్ లోకి అమ్మాయి వస్తే ఎలా ఉంటుందనేది కథ. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించనున్నాడు. జనవరిలో సెట్స్ పైకి తీసుకెళ్ళి ఆగస్ట్ లో విడుదల చేయాలని చూస్తున్నాడు వెంకీ కుడుముల. దాంతోపాటు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై కుమారి 21ఎఫ్ దర్శకుడు సూర్య ప్రతాప్ తెరకెక్కించబోయే సినిమాలో కూడా నితిన్ హీరోగా నటించబోతున్నాడు. ఈ రెండు సినిమాలతో తను కోరుకున్న విజయాలు వస్తాయని నమ్ముతున్నాడు నితిన్.