మూడు గంటల నిడివితో సినిమా రావడం అనేది చిన్న విషయం కాదు.. అంతసేపు ప్రేక్షకులు సినిమా చూడాలి అంటే చూపుతిప్పుకోలేనంత స్క్రీన్ ప్లేతో స్క్రీన్ పై మ్యాజిక్ ఉండాలి.. అలా లేకపోతే అసలుకే మోసం వస్తుంది. రంగస్థలం, భరత్ అనే నేను, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు పకడ్బందీ స్క్రీన్ ప్లేతో వచ్చి మూడు గంటల నిడివి ఉన్న కూడా విజయం సాధించాయి. ఇక ఈ పండక్కి వస్తున్న నాలుగు సినిమాల్లో రెండు సినిమాలు దాదాపు మూడు గంటల నిడివితో వస్తున్నాయి. ఎన్టీఆర్ కథానాయకుడు 2 గంటల 51 నిమిషాల రన్ టైమ్ తో వస్తుంటే.. రజనీకాంత్ పేట సినిమా కూడా 171 నిమిషాల నిడివితో వస్తుంది. ఈ రెండు సినిమాల టైం ఒక్కటే కావడం విశేషం. ఇదే ఇప్పుడు అభిమానులను టెన్షన్ పెడుతున్న అంశం. ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా కూడా మూడు గంటల సినిమా అంటే కాస్త ఆలోచించాల్సిందే.
ఎన్టీఆర్ కథానాయకుడిగా ఎదిగిన వైనాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు క్రిష్.. ఆయన జీవితంలో ఎన్నో తెలియని విషయాలు ఉన్నాయని ప్రేక్షకులు అవన్నీ చూస్తూ మూడు గంటల నిడివి మర్చిపోతారు అంటున్నాడు క్రిష్. కచ్చితంగా సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని చెబుతున్నారు దర్శక నిర్మాతలు. ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పిన చాలా పాత్రలను ఇందులో బాలకృష్ణ పోషించాడు. ఇవన్నీ అభిమానులకు పండగే అంటున్నాడు దర్శకుడు క్రిష్. మరోవైపు రజనీకాంత్ కూడా 2 గంటల 52 నిమిషాల నిడివితో వస్తున్నాడు. పేట సినిమా కూడా అభిమానులకు విందు భోజనం అంటున్నాడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. ఆయన స్టైల్స్ చూస్తూ రన్ టైం మర్చిపోతారు అంటూ హామీ ఇస్తున్నాడు. ఇంకాసేపు ఉంటే బాగుండు అని సినిమా చూసిన తర్వాత కచ్చితంగా అనుకుంటారంటున్నాడు ఈయన. మరి ఈ ఇద్దరు దర్శకుల నమ్మకాలు ఎంతవరకు నిలబడతాయో జనవరి 9, 10 తేదీల్లో తేలనుంది.