ఈ అల్లుడుశీను మాంచి స్పీడున్నోడే.. 


ఇండ‌స్ట్రీలో వ‌ర‌స‌గా అవ‌కాశాలు రావాలంటే హిట్లే ఉండాల్సిన ప‌నిలేదు. ఒక్కోసారి అదృష్టం ఉన్నా స‌రిపోతుంది. లేదంటే వార‌స‌త్వం ఉన్నా ప‌ని జ‌రిగిపోతుంది. ఇప్పుడు బెల్లంకొండ శ్రీ‌నివాస్ కు రెండోదే ఉంది. అదృష్టం ఇప్పుడు కాక‌పోతే త‌ర్వాత వ‌స్తుంది.. కానీ ముందైతే వార‌స‌త్వం ఉంది. అందుకే నాన్న పేరు చెప్పుకుని వ‌ర‌స‌గా సినిమాలు చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీ‌నివాస్. హిట్లు ప్లాపుల‌తో ప‌నిలేదు.. త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు ఈ స్పీడున్నోడు. జ‌య జాన‌కి నాయకా విడుద‌ల‌కు ముందే శ్రీ‌వాస్ తో సాక్ష్యం సినిమాకు క‌మిటైన శ్రీ‌నివాస్.. అప్పుడే మ‌రో సినిమాకు ఓకే చెప్పాడు. శ్రీ‌నివాస్ అనే కొత్త ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి ముందుకొచ్చాడు బెల్లంకొండ వార‌సుడు. వంశ‌ధార క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై కొత్త నిర్మాత న‌వీన్ సొంటినేని ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాడు.
ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా.. కాజ‌ల్ హీరోయిన్ గా న‌టిస్తుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఫిబ్ర‌వ‌రి 22న ఈ చిత్ర ఓపెనింగ్ జ‌ర‌గనుంది. ఈ సినిమాకు కూడా భారీ టెక్నిక‌ల్ టీం ప‌ని చేస్తున్నారు. ఛోటా కే నాయుడు సినిమాటోగ్ర‌ఫీతో పాటు మ‌రిన్ని అంశాలు కూడా సినిమాకు హైలైట్ కానున్నాయి. ఇప్ప‌టికే ఈయ‌న న‌టిస్తోన్న సాక్ష్యం సినిమా షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఇందులో అమ్మానాన్న‌ల్ని పోగొట్టుకునే అనాథ పాత్ర‌లో న‌టిస్తున్నాడు శ్రీ‌నివాస్. శ్రీ‌వాస్ కు గ‌తంలో ల‌క్ష్యం.. లౌక్యం.. లాంటి రెండ‌క్ష‌రాల టైటిల్స్ బాగా క‌లిసొచ్చాయి. పూజాహెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తుంది. మొత్తానికి బెల్లంకొండ వార‌సుడు టాప్ గేర్ లో దూసుకెళ్లిపోతున్నాడు. మే 11న సాక్ష్యం విడుద‌ల కానుంది. ఇదే ఏడాది శ్రీ‌నివాస్ సినిమా కూడా రానుంద‌ని తెలుస్తుంది. మొత్తానికి వ‌రస సినిమాలైతే చేస్తున్నాడు కానీ విజ‌యాలు ఎప్పుడు అందుకుంటాడో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here