‘ఖాకి’ థియేట్రికల్‌ ట్రైలర్‌కు ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్! నవంబర్‌ 17న భారీ రిలీజ్

‘‘మనం చెడ్డవాళ్ల నుంచి మంచివాళ్లను కాపాడే పోలీస్‌ ఉద్యోగం చేయడం లేదు. మంచి వాళ్లనుంచి చెడ్డవాళ్లను కాపాడే చెంచా ఉద్యోగం చేస్తున్నాం.. సార్‌’’ అని ఓ పోలీసాఫీసర్‌ తన పైఅధికారిని అడుగుతున్న ప్రశ్న ఇది. ‘‘పవర్‌లో ఉన్నోడి ప్రాణానికిచ్చే విలువ.. పబ్లిక్‌ ప్రాణాలకు ఎందుకివ్వరు సార్‌’ ఇది అతని ఆవేదన. దీన్నిబట్టి అతనెంత సిన్సియర్‌గా డ్యూటీ చేయాలనుకుంటున్నాడో వేరే చెప్పనవసరం లేదు. అంతేకాదు ‘‘ఎన్ని ట్రాన్స్‌ఫర్స్‌.. హాయిగా లంచం తీసుకొని ఒకచోట ఉండొచ్చు కదా..’’ అని గర్ల్‌ఫ్రెండ్‌ అంటున్నా ఆమె అమాయకత్వానికి నవ్వుకుని ఉద్యోగం పట్ల బాధ్యతగా ఉంటాడు. అలాంటోడికి ఓ కేసు పెద్ద సవాల్‌లా నిలిచింది. ఈ కేసులోని దోషులకు ఎలాగైనా శిక్షపడేలా చేయాలనుకున్నాడు. అప్పుడు అతనికి డిపార్టెంట్‌మెంట్‌ నుంచి ఎలాంటి సపోర్ట్‌ లభించింది? కొందరు రాజకీయ నాయకులు దోషులను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలను అతను ఎలా తిప్పికొట్టాడు? అన్న అంశాలతో రూపొందిన తమిళ చిత్రం ‘ధీరమ్‌ అధిగారమ్‌ ఒండ్రు’.

సూపర్‌ హిట్‌ తమిళ సినిమా ‘చతురంగ వేట్టై’ ఫేమ్‌ హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో  కార్తీ, రకుల్‌ జంటగా రూపొందిన చిత్రమిది.
ఈ సినిమాను తెలుగులో ‘ఖాకి’గా విడుదల చేస్తున్నారు ఉమేశ్‌ గుప్తా, సుభాష్ గుప్తా. ‘ద పవర్‌ ఆఫ్‌ పోలీస్‌’… అనేది ఉపశీర్షిక. జిబ్రాన్‌ స్వరకర్త. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దీపావళి సందర్భంగా రిలీజైన ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌కు ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్ లభిస్తోంది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఇందులో కార్తీ పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. లుక్స్, ఫిజిక్‌ పరంగా ఆయన చాలా కేర్‌ తీసుకున్నారు. కార్తీ∙నటన సూపర్‌. ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. సినిమాను నవంబర్‌ 17న విడుదల చేయాలనుకుంటున్నాం. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ గ్లామర్‌ అండ్‌ యాక్టింగ్‌ ఈ సినిమాకు స్పెషల్‌ ఎట్రాక్షన్‌. దర్శకులు బాగా తెరకెక్కించారు. తెలుగులో ‘రన్‌ రాజా రన్‌’, ‘జిల్‌’, ‘బాబు బంగారం’, ‘హైపర్‌’ తదితర చిత్రాలకు అద్భుతమైన సంగీతమందించిన జిబ్రాన్‌ ఈ సినిమాకూ సూపర్‌ హిట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉంది’’ అన్నారు.

అభిమన్యు సింగ్, బోస్‌ వెంకట్, స్కార్లెట్‌ మెల్లిష్‌ విల్సన్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సత్యన్‌ సూరన్, సంగీతం: జిబ్రాన్, ఆర్ట్‌: కె. ఖదీర్, ఎడిటర్‌: శివనందీశ్వరన్, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్, డ్యాన్స్‌: బృంద, నిర్మాతలు: ఉమేశ్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా.