చ‌ర‌ణ్, ఎన్టీఆర్ కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాడుగా.. 

Rajamouli Teasing NTR & Ram Charan Fans!
మ‌ల్టీస్టార‌ర్ అంటే ఊరికే అవుతుందా..? పైగా ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు ఇండ‌స్ట్రీలో ఎప్పుడూ రాని.. ఇక‌పై వ‌స్తుందో రాదో తెలియ‌ని రేంజ్ లో ఉన్న భారీ మ‌ల్టీస్టార‌ర్. అందుకే రాజ‌మౌళి చాలా జాగ్రత్త‌లు తీసుకుంటున్నాడు. అయినా చేప‌కు ఈత నేర్పాలా అన్న‌ట్లు.. రాజ‌మౌళికి ఈ మ‌ల్టీస్టార‌ర్ గురించి ఏం చేయాలో తెలియ‌దా.. ఎలా చేయాలో తెలియ‌దా..? త‌న‌కు తెలుసు ఈ సినిమాపై అంచ‌నాలు ఎలా ఉన్నాయో..! అందుకే త‌న జాగ్ర‌త్త‌ల్లో తాను ఉంటున్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్ర క‌థ‌పైనే కుస్తీ ప‌డుతున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు. ఈయ‌న సినిమాల‌కు అసిస్టెంట్లే ప్రాణం. ఆయ‌న త‌న సినిమాల కోసం క‌త్తి లాంటి కుర్రాళ్ల‌ను తీసుకుంటాడు. తానేం చేసినా అసిస్టెంట్ల‌కు చెప్పి కానీ చేయ‌డు రాజ‌మౌళి. వాళ్లే ఆయ‌న‌ సినిమాలు ముందుకు న‌డిపిస్తుంటారు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు.
త‌న భారీ మ‌ల్టీస్టార‌ర్ కోసం ప‌క్కా ప్లానింగ్ సిద్ధం చేసుకుంటున్నాడు జ‌క్క‌న్న‌.రాజమౌళి త‌న టీమ్ ను రెండు ముక్కలుగా విడకొడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీళ్ల‌లో ఓ భాగం చ‌ర‌ణ్ కోసం.. మ‌రోభాగం ఎన్టీఆర్ కోసం ప‌గ‌లూ రాత్రి ప‌ని చేయ‌బోతున్నాయి. ఈ సినిమాకు సంబందించి చ‌ర‌ణ్, ఎన్టీఆర్ మ‌ధ్య అద్భుత‌మైన స‌న్నివేశాలు రాయాలంటూ ఇప్ప‌టికే త‌న టీంను రాజ‌మౌళి కోరిన‌ట్లు తెలుస్తుంది. ఇప్ప‌టికే విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ కథ సిద్ధం చేయ‌డంతో.. స్క్రీన్ ప్లే రాయ‌డంలో బిజీగా ఉన్నాడు రాజ‌మౌళి. అంతే కాదు.. ఈ చిత్ర క‌థా చ‌ర్చ‌ల్లో త‌న‌ టీం మొత్తాన్ని ఇన్ వాల్వ్ చేసి అంద‌రి సల‌హాలు తీసుకుంటున్నాడు జ‌క్క‌న్న‌.
దానికితోడు షూటింగ్ మొద‌లుపెట్టే ముందే.. చ‌ర‌ణ్, ఎన్టీఆర్ పై టెస్ట్ క‌ట్ కూడా చేయ‌బోతున్నాడు రాజ‌మౌళి. అక్క‌డితో ఆగితే బాగున్ను. ఇప్పుడు ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా నెల రోజుల పాటు అటు చ‌ర‌ణ్.. ఇటు ఎన్టీఆర్ కు బాక్సింగ్ లో శిక్ష‌ణ ఇప్పించ‌నున్నాడు రాజ‌మౌళి. గ‌తంలో బాహుబ‌లి కోసం ప్ర‌భాస్, రానాతో పాటు త‌మ‌న్నా, అనుష్క‌కు కూడా చుక్క‌లు చూపించాడు. ఇక అప్ప‌ట్లో సై సినిమా కోసం ప్ర‌త్యేకంగా నితిన్ బ్యాచ్ కు ర‌గ్బీలో శిక్ష‌ణ ఇప్పించాడు. ఇప్పుడు కూడా అంతే. బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌బోయే ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా నెల రోజుల పాటు చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ల‌ను హౌజ్ అరెస్ట్ చేయ‌డానికి ఫిక్సైపోయాడు ద‌ర్శ‌క‌ధీరుడు. అన్నీ కుదిర్తే అక్టోబ‌ర్ లో ప‌ట్టాలెక్కే ఈ సినిమా వ‌చ్చే ఏడాది జులైలో విడుద‌ల కానుంది. ఎందుకంటే జులై రాజ‌మౌళికి బాగా అచ్చొచ్చిన నెల‌. మొత్తానికి చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ల‌కు బాగానే చెమ‌టలు ప‌ట్టిస్తున్నాడు జ‌క్క‌న్న‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here