CRITICS METER
Average Critics Rating: 0
Total Critics:0
AUDIENCE METER

Average Critics Rating: 0
Total Critics:0
నటీనటులు: పవన్ కళ్యాణ్, కీర్తిసురేష్, అను ఎమ్మాన్యువల్, మురళి శర్మ, బోమన్ ఇరానీ..
సంగీతం: అనిరుధ్ రవిచంద్ర
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: త‌్రివిక్రమ్
నిర్మాత: రాధాకృష్ణ
తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ కూడా అజ్ఞాతవాసి ఫీవర్ తోనే ఊగిపోతున్నారు పవన్ ఫ్యాన్స్. జల్సా.. అత్తారింటికి దారేది లాంటి కాంబినేషన్ మళ్లీ రిపీట్ కావడంతో ఈ చిత్రంపై ఎక్కడలేని అంచనాలు వచ్చేసాయి. మరి నిజంగానే అజ్ఞాతవాసి అందరి తాట తీసాడా.. సినిమా ఎలా ఉంది..?
కథ:
గోవింద భార్గవ ఎకా విందా (బోమన్ ఇరానీ) వేల కోట్లకు అధిపతి. ఒక్కడే స్టార్ట్ కొన్ని వేల కోట్ల సంపాదిస్తాడు. అలాంటి ఆయన ఆస్తులపై కన్నేస్తారు అతడి స్నేహితులు. ఆస్తి కోసం ఆయన్ని చంపేస్తారు. దాంతో ఆయన్ని చంపిన వాళ్లను చంపడానికి అజ్ఞాతంలో ఉన్న ఆయన వారసుడు అభిషిక్త్ భార్గవ్(పవన్ కళ్యాణ్) రంగంలోకి దింపుతుంది వింధా రెండో భార్య ఇంద్రాణి (ఖుష్బూ). వచ్చీ రాగానే తన కంపెనీలో తాను ఎంప్లాయ్ గా చేరతాడు. అప్పట్నుంచీ వర్మ, శర్మ(మురళీ శర్మ, రావురమేష్) లతో ఆడుకుంటాడు. ఆ తర్వాత తండ్రిని చంపింది వాళ్లు కాదని తెలుసుకుంటాడు. అసలు మనిషి మరొకరు అని తెలుస్తుంది. అతడే సీతారాం(ఆది పినిశెట్టి). అసలు ఎందుకు చంపారు..? అభి వచ్చి ఎలా పగ తీర్చుకున్నాడు అనేది అసలు కథ.
కథనం:
జీవితంలో మనం కోరుకునే ప్రతీ సౌకర్యం వెనక మినీ యుద్ధమే దాగుంటుంది కదా. ఇది త్రివిక్రమ్ రాసిన డైలాగే. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా ఇదే అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా తొలిరోజు తొలి షో చూడాలనుకోవడం చాలా మంది అభిమానులకు సౌకర్యం.. కానీ సినిమా మొదలైన కాసేపటికే అది ఎప్పుడు పూర్తవుతుందా అనే మినీయుద్ధం కూడా జరుగుతుందేమో..? ఎక్కడైనా త్రివిక్రమ్ మ్యాజిక్ సినిమాలో కనిపిస్తుందా అని చాలా మంది ఫ్యాన్స్ వేచి చూసారు కానీ అది పెద్దగా వర్కవుట్ కాలేదు ఈ చిత్రంలో. మధ్యమధ్యలో మేమున్నాం అంటూ గుర్తు చేయడానికి హీరోయిన్లు వస్తుంటారు కానీ వాళ్ళతో పెద్దగా అవసరం లేదనిపించింది. త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్లు ఇంతగా తేలిపోయిన సినిమా అయితే ఇదే. ఫస్టాఫ్ లో భలే ఉందిరా అనే సీన్ ఒక్కటీ లేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా సోసోగానే డిజైన్ చేసాడు దర్శకుడు.
పోనీలే సెకండాఫ్ కుమ్మేస్తాడేమో అనుకుంటే.. డైలాగ్స్ తో కట్టి పడేస్తాడేమో అని ఆశపడితే అప్పుడు కూడా నిరాశే. అత్తారింటికి దారేది తరహాలో ఎమోషన్స్ తో మనసును తడిపేస్తాడేమో అనుకున్న అభిమానులను సహనానికి పరీక్ష పెట్టే సీన్స్ రాసుకున్నాడు మాటల మాంత్రికుడు. ముఖ్యంగా ఆఫీస్ లో వచ్చే సైకిల్ సీన్ అయితే నిజంగానే ప్రేక్షకులకు పరీక్షే. కొడకా కోటేశ్వరరావ్ పాట ఒక్కటే పవన్ ఫ్యాన్స్ కు సంతోషాన్నిచ్చేది. సైకిల్ ఎక్కి అందర్నీ కొడుతూ రౌడీ అల్లుడు సీన్ గుర్తు చేసాడు త్రివిక్రమ్. కానీ చిరంజీవిని చూసి నవ్వుకున్న వాళ్లకు పవన్ మాత్రం ఏడిపించాడు. అనవసరంగా పాటలు మధ్యలో వస్తుంటే.. అర్థం పర్థం లేని సీన్స్ డిస్టర్బ్ చేస్తుంటే.. కథలో నేను ఉన్నానంటూ అప్పుడప్పుడూ విలన్ గుర్తు చేస్తుంటే..
నిజంగా కథ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందేమో అని చాలామందికి అనిపిస్తుంది.
నటీనటులు:
పాతిక సినిమాల అనుభవం ఉన్న నటుడు బాగా చేసాడు.. నటించాడు అని చెప్పడం అవివేకం. పవన్ కళ్యాణ్ ఎప్పట్లాగే తన యాక్టింగ్ చేసాడు. నిజానికి చాలా సీన్స్ ఈయనే నిలబెట్టాడు కూడా. కానీ కథ సహకరించలేదు. అయితే చిన్న పిల్లాడిలా మాట్లాడటం మాత్రం కొన్ని సీన్లకు పరిమితం చేసి ఉంటే బాగుండేది.. అది కాస్త ఎక్కువ అనిపించింది. హీరోయిన్ల గురించి చెప్పడానికి ఏం లేదు. అను ఎమ్మాన్యువల్ అయితే కేవలం అందాల ఆరబోతకే పరిమితమైంది. ఇక కీర్తిసురేష్ తొలిసారి కమర్షియల్ హీరోయిన్ అని నిరూపించుకుంది. మురళిశర్మ, రావురమేష్ నవ్వించారు. వాళ్లే ఈ సినిమాకు పెద్ద రిలీఫ్. బోమన్ ఇరాని చిన్న పాత్రైనా తన వంతు పోషించాడు. ఖుష్బూ, ఆది బాగా చేసారు. వాళ్ల పాత్రల నిడివి చాలా చిన్నది. మిగిలిన వాళ్లంతా ఓకే.
టెక్నికల్ టీం:
అత్తారింటికి దారేది సినిమాకు కథతో పాటు సంగీతం ప్రాణం. కానీ ఈ చిత్రానికి అదే మైనస్. దేవీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. అనిరుధ్ మంచి సంగీత దర్శకుడే కానీ ఈ చిత్రానికి మాత్రం అనుకున్న స్థాయిలో మ్యూజిక్ ఇవ్వలేదు. ఆర్ఆర్ ఓకే. మణికందన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ చాలా వీక్ అనిపించింది. చాలా సీన్లు బోర్ కొట్టించాయి. అతుకుల బొంతలా అనిపించింది సినిమా. ఎక్కడో కట్ అయిన సీన్ మరెక్కడో కనెక్ట్ అయినట్లు.. సడన్ గా జంప్ కట్లు కనిపించాయి. ఒకే సీన్ లో పవన్ కళ్యాణ్ రెండు రకాలుగా కనిపిస్తాడు. అంత వీక్ ఎడిటింగ్ అనిపించింది. ఇక త్రివిక్రమ్ గురించి చెప్పుకోవాలి.. ఈ చిత్రం ఎందుకో పూర్తిగా మిస్ ఫైర్ అయిపోయింది. మనకు త్రివిక్రమ్ అంటే వెంటనే గుర్తొచ్చేది డైలాగ్స్.. అలాంటివి చాలా లిమిటెడ్ గా ఈ చిత్రంలో ఉన్నాయి. రచయితగా అక్కడక్కడ మెప్పించిన ఈయన.. ఎందుకో కానీ ఈ సారి దర్శకుడిగా మాత్రం పూర్తిగా విఫలం అయ్యాడు.
చివరగా:
విచక్షణతో తీస్తే అత్తారింటికి దారేది..
విచ్చలవిడిగా తీస్తే అజ్ఞాతవాసి..