ఫ్రీ చైతన్య.. పారాయణ కాలేజీ!

శ్రీ చైతన్య నారాయణ కాలేజీల తీరును ఎండగడుతూ లోతుగా అధ్యానం చేసి ఓ అజ్ఞ్యాతవాసి రాసిన ఈ వ్యాసం సామజిక మాధ్యమంలో వైరల్ గా మారింది. మీ కోసం..
శ్రీ చైతన్య/నారాయణ కాలేజీలలో మీ పిల్లలని చేర్పించాలనుకుంటున్నారా?
అయితే ముందుగా నా అనుభవాన్ని చదవండి.
డాక్టర్ అవ్వాలని ప్రఘాఢమైన కోరిక ఉండడంవలన మా అమ్మాయిని 2 సంవత్సరాలక్రితం నిజాంపేటలోని శ్రీచైతన్యకు గల గంపెడు కళాశాలలలోని ఒకానొక కళాశాలలో చేర్పించాను. నిజానికి నాకు కార్పొరేట్ కాలేజీలపైన పెద్దగా అవగాహన లేదు. ఎందుకంటే మా కుటుంబం నుండి డాక్టర్లు అయిన ముగ్గురూ మామూలుగా గవర్నమెంటు జూనియర్ కళాశాలలో చదువుకొన్నవారే (15 నుండి 10 క్రితంవరకూ). ఆ తరువాత మళ్ళీ ఆ కోర్సు చేసేవారెవరూలేకపొవడంతో ఆ దిశగా ఆలోచించే అవసరం రాలేదు. కానీ మా పాప ఉద్దేశ్యం తెలిసినప్పుడుకూడా అలాగే ఏదో ఒక కాలేజీలోచదువుకొని ఎంసెట్ రాస్తుందనుకున్నాను.
అయితే పాప 10లో ఉండగానే ఎలా తెసుకున్నారో కానీ మా పాప అడ్రస్ తీసుకొని ఒక ఏజంట్ మా ఇంటికి వచ్చాడు. ఫలనా ఫలానా వాళ్ళు చేరారని, మంచి మార్కులతో చదువుకునే వారికి తగ్గింపు ఫీజు అని, సీట్లు కూడా త్వరగా అయిపోతున్నాయని, ఆలస్యం చేస్తే మంచి “కాంపస్”లో దొరకదని, ఫలానా బ్రాంచ్‌లో అయితే ఎక్కువమంది ఇక్కడినుండే ఉన్నారని, అందరూ కలిసిఉంటే వారికి కూడా తోడుంటుందని చెప్పుకొచ్చాడు. ఆయనదగ్గర ఉన్న లిస్ట్‌లో కొంతమందికి ఫోన్ చేస్తే వారుకూడా చేర్పించే ఉద్దేశ్యంలో ఉన్నట్టు చెప్పారు. అప్పటికీ నేను అంత ఉత్సాహం చూపలేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
1. పాపకు సహజంగానే మంచి మార్కులు వస్తుండేవి.
2. ఎప్పుడూ ఇల్లు విడిచి ఉన్న అలవాటు లేదు.
3. మంచి “కూచిపూడి” డాన్సర్ మరియు వాళ్ళ స్కూల్‌లో తను కల్చరల్ సెక్రటరీ
4. చదువుపరంగా ఎటువంటి వత్తిళ్ళూ లేకుండా ఆడుతూ పాడుతూ 9.8 గ్రేడ్ తో 10వ తరగతి పాస్ అయింది.
5. పైగా డాక్టర్ అవ్వాలన్న దృఢ సంకల్పంతో ఉంది.
కాబట్టి కార్పొరేట్ కాలేజీకి సంబందించిన ఆలోచన ఎప్పుడూ చేయలేదు.
అయితే 10వ తరగతి ఫలితాలముందు కొన్ని పరిణామాలు జరిగాయి.
1. సెలవులవల్ల పాప ఎక్కువగా TV చూడడం లేదా నిద్ర పోవడం
2. అప్పుడప్పుడూ ఇంతకుముందు వచ్చిన శ్రీ చైతన్య ఏజంట్ ఫోన్ చేసి మా యోగక్షేమాలు కనుక్కుంటూ ఉండడం.
3. పాప వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసినప్పుదల్ల ఎవరో ఒకరు ఫలనా కాలేజీలో చేరిపోయానని, తొందరలో తరగతులు కూడా మొదలవుతాయని చెప్పడం
జరుగుతుండేది.
ఆ తరువాత కొంతమంది మితృలు కూడా కార్పొరేట్ కాలేజీలలో అయితే సుశిక్షుతులైన, మెరకల్లాంటి, తలపండిన మేధావులుంటారని, ఎటువంటి సందేహాన్నైనా చిటికెలో తీర్చేస్తారని, పైగా పిల్లలకు పోటీ వాతవరణం ఉంటుంది కాబట్టి సమయం వృధా చేయకుండా చదువుకుంటారని, ఎక్కడెక్కడ ఎటువంటి పరీక్షలు జరుగుతాయో ఏ ఏ సమయాలలో జరుగుతాయో చెబుతుంటారని, వారి చేతిలో పడీతే రాళ్ళు రత్నాలవుతాయని, రత్నాలు ఇంకేవో అవుతాయని అన్న స్థాయిలో చెప్పేవారు. నేను అప్పటికీ వీటికి వ్యతిరేకంగానే ఉన్నాను. ఎందుకంటే మా పాప ఎలా చదువుతుందో నాకు తెలుసు. తనకి వత్తిడి పడదు. చదవాలనుకుంటే అర్థరాత్రి వరకైనా లేదా తెళ్ళవారు ఝామునైనా లేచి చదువుకునేది. తన స్వీయనియంత్రనలో తను ఉండేది. వీలయినంతవరకూ తన స్వశక్తితోనే చదివి సీటు తెచ్చుకోవాలనే భావనలో ఉండేది. పైగా కొన్ని సంధర్భాలలో ఈ కళాశాలల లీలలు కొన్ని నేను లీలగా విని ఉన్నాను. కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొన్న సంఘటనలు కూడా ఏ కళాశాలలో జరిగాయి.
కానీ, రోజు రోజుకీ మా మీద మాకు తెలియకుండానే వత్తిడి పెరిగింది. ఆయా కళాశాలలో ఉన్నవారితో పోటీ పడాలంటే అటువంటి వాతావరణం ఉండాలేమో, ఒకవేళ అటువంటి కళాశాలలో చేరకపోయి సీటు రాకపోతే జీవితాంతం అయ్యో రెండు సంవత్సరాలు రిస్క్ తీసుకుంటే బాగుండేదేమో అన్న సందేహం అలాగే ఉండిపోతుందనిపించింది. (ఆ తరువాత ఇతర తల్లితండ్రులతో మాట్లాడినప్పుడు సుమారుగా అందరూ అదే సందేహంతో వచ్చినట్టు అర్థమయింది).
చివారికి మా పాప కూడా అక్కడ చేరితే ఇంకా మంచి రాంకు రావచ్చేమో అనడంతో చివరికి ఒకరోజు అసలు కాలేజీ వాతావరణం, భోజన సౌకర్యాలు ఎలా ఉంటాయో చూసివద్దాం అని బయలుదేరాం. మా ఏజంటు మాకు అత్య్యుత్తమమని చెప్పిన బ్రాంచ్‌కి వెళ్ళాం. వాతావరణం ఫరవాలేదనిపించింది. కాలేజీ హాస్టలూ వేరు వేరుగా ఉన్నాయి. హాస్టల్ రూములో రూముకి 4గురు ఉండవచ్చని, శీతాకాలంలో వేడినీటి సౌకర్యంకూడా ఉందని, సమీప కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్య సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. మీ అమ్మాయికి బాగా వెంటిలేషన్ ఉన్న రూము ఇస్తామని “ప్రత్యేక” శ్రద్ద చూపించారు. ఆలోచించుకుంటామని చెప్పి వచ్చేసాం.
ఆ తరువాత ఇంట్లోకూడా చాలా తర్జన భర్జనలు నడిచాయి. హాస్టల్లో ఉండగలుగుతుందా లేదా? ఇంటివద్దే ఉండి తనే స్వంతంగా చదువుకుంటుందా? రెండు సంవత్సరాలపాటు వత్తిడిని తట్టుకుంటుందా వంటి ప్రశ్నలు పదే పదే అడిగి తనని మానసికంగా అక్కడి వాతరణానికి సిద్దం చేసి ఓ శుభముహూర్తాన కాలేజీలో చేరడానికి ప్రయాణమయ్యారు. అదే కాలేజీకి దగ్గరలో మా అబ్బాయి చదువుతున్న కాలేజీ కూడా ఉండటంతో కొంత ధైర్యంతో ఉన్నాం. (నేను నాగపూర్ కాంప్‌లో ఉండడంవల్ల నాకు కుదరలేదు). కాలేజీకి వీరు వెళ్ళేసరికి పెద్ద జాతరలాగా ఉందట. ముందు మేము చూసిన రూము లేదట. ప్రస్థుతానికి సర్దుకోండి, తరువాత రూములు సర్దుబాటు చేస్తాం అని చెప్పారట.
అలా కాలేజీలో చేర్పించి మళ్ళి వారం తరువాత చూడడానికి వెళ్ళాం. మా అమ్మాయి కాస్త ధైర్యంగానే కనిపించింది. క్లాసులు బాగానే జరుగుతున్నాయని, తొందర్లో జరగబొయే పరీక్షలలో మార్కులనిబట్టి వివిధ బాచులకి మార్చుతారని చెప్పింది. హాస్టల్ రూములో 10 మంది ఉన్నారట. వెళ్ళి కనుక్కుంటామంటే అవసరంలేదు. కేవలం పడుకోవడానికే అక్కడికి వెళతామని, పొద్దున్న 5.30 నుండి రాత్రి 10 గంటలవరకూ క్లాసురూములోనే చదువుకోవాలని చెప్పింది. అన్ని గంటలా? అని మేము నోరువెళ్ళబెడితే, ఇది ఇంకా నయమని, పరీక్షలు దగ్గరపడినకోద్దీ 4 నుండి రాత్రి 11 గంటలవరకూ చదవాల్సి ఉంటుందని చెప్పారట. వేరే కార్యక్రామాలేవీ ఉండవని, కేవలం లంచ్ బ్రేక్ మాత్రమే ఉంటుందని, సాయంత్రం ఒక గంట బ్రేక్ ఉంటుందని, తల్లి తంద్రులు కేవలం ఆ సమయంలోనే కలవచ్చని చెప్పారట. చాలామంది పిల్లలూ వారి తల్లితంద్రులూ ఏడుస్తూ కనిపించారు.
ఇందులో కూడా అసలు క్లాసులు జరిగే టైం మధ్యాహ్నం 1 గంటవరకేనట. ఆ తరువాత అంతా “స్టడీ అవర్స్” అని, ఆ టైములో తామే చదువుకోవాలని, సందేహాలు తీర్చడానికి “జూనియర్ లెక్చరర్లు” అనబడేవారు ఉన్నా వారు కేవలం కాపలాకోసమే తప్ప వారికి పెద్దగా సబ్జెక్ట్ తెలియదని తెలిసింది. ఏ గంటలో ఏది చదవాలో కూడా వారే చెబుతారట.
ఇక అక్కడి “పోటీ” వాతావరణం గురించి తెలిసి ఆశ్చర్యపోయాను. అక్కడ విద్యార్థులలోకన్నా అధ్యాపకుల మధ్యన, కళాశాల బ్రాంచీల మధ్యన, బ్రాంచీ ఇంచార్జీల మధ్యన “భయంకరమైన” పోటీ ఉన్నట్టు అర్థమయింది. ఏ బ్రాంచీలో ఎన్ని రాంకులు వచ్చాయి? మన బ్రాంచీలో ర్యాంకులు ఎలా పెంచాలి? ఎక్కడి లెక్చరర్లని లాగాలి? అనే విశయంలో ఉన్న శ్రద్ద పిల్లలపట్ల ఉన్నట్టు కనపడలేదు. లెక్చరర్లు తమ సబ్జెక్టులో లోపం లేదనిపించుకోవడంకోసం విద్యార్థులను తమ సబ్జెక్టునే ఎక్కువగా చదవమని చెప్పడం జరిగేదట. అన్ని సెంటర్లకీ కలిపి పరీక్షలు జరుగుతాయి కాబట్టి ఏరోజు జరగాల్సిన క్లాసు ఆరోజు జరగాల్సిందేనట. ఒకవేళ ఏదైనా కారణం చేతనైనా అధ్యపకులు రాలేకపోతే ఆ మరుసటి రోజు రెండురోజుల సిలబస్ “లాగించేసే వారట”. అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి అని అడిగే అవకాశం కూడా సరిగ్గా దొరికేది కాదట. ఒకవేళ అడిగినా “ఇంత చిన్న డౌటే కదా, జూనియర్ లెక్చరర్తో చెప్పించుకోండి అనేవారట. ఒకటి రెండు సార్లు వాళ్ళను అడిగిన తరువాత వారిని అడగటంకంటే ఊరుకున్నది ఉత్తమం అనిపించిందట.
3 నెలల తరువాత చాలామంది పిల్లలకి ఒంటిమీద మచ్చలు (విటమిన్ల లోపాలు – ఎండ తగలకపోవడంవల్ల) ప్రారంభమయ్యాయి. కొంతమందికి జ్వరాలు, ఇంటిమీద బెంగ ఒకపక్క చదువుమీద వత్తిడి మరోపక్కతో చాలా నీరసపడిపోయారు. ఒకసారి మా పాపకి జ్వరంవచ్చి వార్డెన్‌తో చెబితే రకరకాల ప్రశ్నలువేసి “సిక్ రూము”కి పంపిందట. ఆ తరువాత పట్టించుకున్న నాధుడులేదు. మధ్యలో ఒకరు వచ్చి వ్యాన్ వచ్చిన తరువాత మిమ్మల్ని డాక్టర్ వద్దకు తీసుకొనివెళతాము అని చెప్పారట. మధ్యాహ్నందాకా చూసి మాకు ఫోన్ చేసింది. మేము వెంటనే బయలుదేరి 150కిలోమీటర్లు ప్రయాణించి అక్కడికిచేరుకున్నతరువాత కూడా వారి “వ్యాను” రాలేదు. పాపకి 103 డిగ్రీల జ్వరం. ఇదేమిటయ్యా అని ప్రిన్సిపల్‌ని అడిగితే పిల్లలు అలాగే చెబుతారని, ఒకరోజు చూసిన తరువాత “అవసరమైతే” హాస్పిటల్‌కి పంపిస్తుంటామని, పాప విషయంలో మేమే తొందరపడ్డామేమో అనె విధంగా మాట్లాడాడు. ఎలాగూ “హోం సిక్” సెలవలు ఇస్తారు కదా అని పర్మిషన్ తీసుకొని ఇంటికితీసుకొని వచ్చాము. తీరా పరీక్షలు చేయిస్తే “టైఫాయిడ్” అని తేలింది. అదే విషయం కాలేజీ వారికి ఫోన్ చేసి పూర్తిగా కోలుకొన్న తరువాత పంపిస్తామని చెప్పాము. ఆ సమయంలో రెండురోజులకొక ఫోన్ వచ్చేది. క్లాసులు అయిపోతున్నాయని, మరోటని. ఆరొగ్యం ముఖ్యం కాబట్టి పూర్తిగా కోలుకున్న తరువాతనే పంపిస్తామని చెప్పినా వారు పదే పదే ఫోన్ చేసి మాట్లాడే పద్దతి చూస్తే తల్లి తండ్రులే పిల్లల తరపున అబద్దాలు చెబుతున్నారని అనుకుంటున్నట్లు కనపడింది. ఆ తరువాత (సుమారు 10 రోజులు) పాప కోలుకోవడమూ, మళ్ళీ వెళ్ళి చేరడమూ, కాలేజీ రోటిన్‌లో పడిపోవడమూ జరిగాయి. ఒకటి రెండు పరీక్షలలో మార్కులు తగ్గినా మల్లీ తొందర్లోనే తన మామూలు రాంకుకు చేరుకోగలిగింది. దానికి కాలేజీవైపునుండి దొరికిన సహకారం దాదాపు సున్న అనే చేప్పుకోవాలి. ఎక్కూశాతం మితృల సహకారమే అని చెప్పింది.
పుట్టినరోజులకీ పండగలకీ ఎప్పుడైనా పర్మిషన్ అడిగితే వాళ్ళ శరీరంలో భాగం కోసి ఇమ్మన్నట్టుగా మొహం పెట్టేవారు. వీటికికూడా ఇంటికి/బయటకి వెళతారా అన్నట్టుగా ఆశ్చర్యపోయేవారు. గంట పర్మిషన్ తీసుకోవడంకంటే తిరుమలవాసుడి దర్శనం సులభం అంటే ఆశ్చర్యం లేదు. నిజానికి మధ్యాహ్నం తరువాత క్లాసులు కూడా ఉండవు. సమయం విషయంలో వారి పద్దతిచూస్తే “ఒక సెకను విలువ” వీరికి తెలిసినంతగా మన సైన్యానికి కూడా తెలియదనిపించేది.
మధ్యలో ఒకసారి మా ఇంట్లో పెళ్ళి జరిగింది. అదృష్టవషాత్తూ సెలవులలో వచ్చింది కబట్టి పర్మిషన్ అడగాల్సిన అవసరం రాలేదు. అయితే పెళ్ళి తరువాతరోజే కాలేజీ తెరుస్తున్నారు. కానీ పెళ్ళి తరువాత సత్యనారాయణ వ్రతం వంటి కార్యక్రమాలు ఉండడంవల్ల పాపని పంపలేకపోయాము. ఆ రాత్రి మా పాప సరిగా నిద్ర పోలేదు. అంతకుముందు ఎవరో అలాగే ఆలస్యంగా వస్తే రెండు రోజులు బయటే నిలబెట్టారట. తన భయంచూసి చివరికి తనతోపాటు మేమూ పొద్దున్నే 3.30 నిముషాలకి బయలుదేరి 5.45 వళ్ళ కాలేజీలో దింపాము. అప్పతికే అక్కడున్న వైస్ ప్రిన్సిపాల్ని కలిసి పరిస్థితి వివరించి, పాప భయపడుతోందని, తనెప్పుడూ పనిష్మెంటు తీసుకోలేదని, మానసికంగా చాలసున్నితమైంది కాబట్టి తననేమీ అనకుండా లోపల కూర్చోబెట్టమని చెప్పాము. ఆయనకూడా సరే అని పాపను క్లాసుకివెళ్ళమని చెప్పాడు. అయితే పాప లోపలికి అన్యమనస్కంగానే వెళ్ళింది. నాకెందుకో తను అలా వెళ్ళడం తృప్తిగా అనిపించలేదు. 7.30 బ్రేక్‌ఫాస్ట్ టైములో కలుద్దామని అక్కడే ఉండిపోయాను. మొదటీంతస్తులో ఉన్న మా పాప క్లాసు రోడ్డుమీదికి కనపడుతుంటుంది. సరిగ్గా ఆరు గంటలకి పాప క్లాసుకి వెళ్ళడమూ, ఐదు నిముషాల తరువాత లెక్చరర్ క్లాసులోకి వెళ్ళడమూ, ఆ మరునిమిషంలో పాప ఏడుస్తూ బయటికి వచ్చి వరండాలో నిలిచుండడమూ జరిగిపోయాయి. మల్లీ వైస్ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాను. నేను ఇంతచెప్పినా జరిగిందేమిటని అడిగాను. అతను ఎవరికో చెప్పి పంపినా పరిస్థితిలో మార్పు లేదు. ఆరోజు సంగతేమిటో తేల్చుకొనేవెలదామని నిర్ణయించుకొన్నాను. వైస్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్‌కి ఫోన్ చేసి చెప్పాడు. ఆయన మరెవరితోనో మాట్లాడాడు. చివరికి ఆ లెక్చరర్ మొండివాడండీ. మేము చెప్పినా వినడు అన్నాడు. మరి మీరేం చేస్తుంటారంటే సమధానం లేదు. ఇక లాభంలేదని ఒక పేపర్ తీసుకొని సమస్య అంతా వివరిస్తూ నాకు TC వెంటనే ఇప్పించండని వ్రాసాను. విషయంతెలుసుకున్న వైస్ ప్రిన్సిపాల్ “డీన్” గారికి చెప్పాడు. కొన్ని బ్రాంచీలకి కలిపి ఒక డీన్ ఉంటారట. కాసేపటికి ఆయన వచ్చి మళ్ళీ అదే సంజాయిషీ ఇవ్వబోయాడు. కొంతమంది ఇళ్ళకు వెళ్ళి త్వరగా రారని, అలాంటివారికి ఇలా భయపెడతామని, ప్రత్యేకించి ఆ లెక్చరర్ సమయంవిషయంలో చండామార్కులంతటి వారని చెప్పాడు. కానీ నేను బయటనే ఉండి ఆయన 5 నిముషాలు ఆలస్యంగా రావడం చూసానని, ఒక రోజు క్లాసుకి రాకపోవడంవల్ల విద్యార్థులు నష్టపోతారని భావించే ఆయన ఆ తరువాత రెండు/మూడు రోజులు అలా వరండాలో నిలబేడితే మరి ఆ మూడు రోజుల క్లాసుల మాటేమిటంటే సమాధానం లేదు. మొత్తమ్మీద ఆయన మీద పైకి ఫిర్యాదు చేస్తామని, మరోసారి అలా జరగకుండా చూస్తామని, ఇంతటితో ఈ విషయం వదిలిపెట్టమని అన్నారు.
కాలేజీలో బట్టలు పిండడానికి ఒక ధోభీ ఉంటారు. సంవత్సరానికి 750 రూపాయలు కట్టాలి. కానీ రెందోసారి ఉంతుకు తరువాత చాలామంది పిల్లలకి దురదలు మొదలయ్యాయి. వాదించడంవల్ల ఉపయోగంలేదు కాబట్టి ప్రతివారం ఉతికినబట్టలు ఇచ్చి మాసిన బట్టలు తీసుకొచ్చేవాళ్ళము. ఐనా సరే 750 చెల్లించాల్సిందే. పిల్లలవద్ద సెల్ ఫోన్లను అనుమతించరు. ఫోన్ చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లను మాత్రమే వాడాలి. ఫోన్ బిల్లులు “మాములుగానే” ఎక్కువ వస్తాయి. భోజనం మాత్రం బాగానే ఉండేది. కానీ పిల్లలు మాత్రం తల్లితందృలు వచ్చే రోజులలో ఒకలాగా మామూలు రోజులలలో ఒకలాగా ఉండెవని చెప్పేవారు.
మొదటి సంవత్సరం పరీక్షలకి వీరి కాలేజీకి దగ్గర్లోని (3km) మరో కాలేజీలో పడింది. పరీక్ష కేంద్రానికి తీసుకొనివెళ్ళడానికి, తిరిగి తీసుకొని రావడానికి Rs900 వసూలు చేశారు. ఏ లెక్కన ఇంత అయింది అంటే ఎవరికీ తెలియదు. మాకు “పైనుండి” ఆర్డర్ అని మాత్రమే సమాధానం వస్తుంది. వీటికి అదనంగా Rs2,600 “మెటీరియల్” ఖర్చు. మన ఇంటికి వచ్చిన ఏజంటు అంతా మేము చెప్పినట్టే అక్కడ వసతులు ఇస్తారు అని చెబుతారు కనీ ఒకసారి అక్కడ చేరినతరువాత వీరి పాత్ర దాదాపు శూన్యం. కనీసం వీరిని పట్టించుకోరు కూడా.
ఒక BIPCలోనే 7 బాచులు ఉండేవి. అందులో కేవలం మొదటి రెండు బాచులలోవారిమీదే (60-80 మంది ఒక బాచు) వారి దృష్టి మొత్తం. వారి ఉద్దేశ్యంలో మిగతా బాచులన్నీ కేవలం IPE పాస్ అవడానికి మాత్రమే. అదే విధంగా శిక్షణ కూడా ఉండేది. ఒకే లెక్తరర్ రెండు బాచ్లలో బోధించే విధానం వేరు వేరుగా ఉండేది. ఈ విషయాలన్నీ భోజనం సమయంలోనో, ఆదివారాలలోనో తెలిసేవి.
మొత్తంమీద మొదటి సంవత్సరం అలా గడిచిపోయింది. ఫలితాల రోజున మళ్ళీ మేము అక్కడ హాజరు. మా పాప 96.7 శాతం మార్కులతో పాసు. కానీ ఆ ఉత్సాహం ఎక్కడా కనిపించలేదు. కాలేజీవారు ఏఏ బ్రాంచీలలో 99శాతం సాధించారో సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. హడావుడిగా వెళుతున్న ప్రిన్సిపాల్ మమ్మల్ని చూసి ఆగి మార్కులు కనుక్కొని, ఇంప్రూవ్‌మెంటు వ్రాయమ్మా తప్పకుండా మార్కులు పెరుగుతాయి. ఇంటికిపోకుండా ఇక్కడే చదివితే నీకు 99శాతం వచ్చేది అన్నాడు. ఇన్ని మార్కులు వస్తే ఏం జరుగుతుందంటే ఇవన్నీ ఎంసెట్‌లో వెయిటేజీకి పనికొస్తాయని అన్నాడు. ఆరోజు నేను అక్కడ కలిసినవాళ్ళలో చాలమందికి దాదాపు 95% పైనే మార్కులు వచ్చాయి. అలాంటప్పుడు 25% వెయిటేజీ పెద్ద ప్రభావం చూపే అవకాశం లేదు.
మొదటి సంవత్సరం ఫలితాలని బట్టి కొంతమందిని STAR బాచుకు ఎంపిక చేస్తారని, వారికి ప్రత్యేక శిఖణ ఉంటుందని. దానికి గానూ Rs20,000 వేలు ఎక్కువ అవుతాయని, నమ్మకమున్న వెరే బాచు విద్యార్థులు కూడా డబ్బులు కట్టి STAR బాచులో చేరవచ్చాని ప్రకటించారట. అయితే ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ మరియు త్యూటర్లు “శకుని” పాత్ర పోశించి, కేవలం STAR బాచు విద్యార్థులకే రాంకులు వస్తాయని, మిగతావారంతా వారి వారి అదృష్టం మీద ఆధారపడాలన్నట్టుగా చెప్పేవారట. దానితో రెండోసంవత్సరం ప్రారభానికల్లా 5 STAR బాచులు ప్రారంభమయ్యాయి. వీరి వ్యాపార నైపుణ్యానికి ఇది ఒక మచ్చు తుణక.
రెండవ సంవత్సరంలో కాలేజీని మరొక ప్రదేశానికి (Laandmaark) మార్చారు. ఇంతకుముందు కాంపస్‌లో కనీసం వెళుతురు ఉండేది. కనీసం అలా భోజనానికి వెళ్ళేటప్పుడో వచ్చేటప్పుడో కొంత ఏండ తగిలేది. కొంత విశాలంగా ఉండేది. కానీ ఈ క్యాంపస్ మరీ దారుణం. లైటు లేకపోతే క్లాసురూములో ఏమీ కనిపించదు. ఒక జైలుకన్నా ఎక్కువ భద్రతా ఏర్పాట్లు ఉన్నట్టు అనిపించింది. లంచ్ టైములోనూ, బ్రేక్ టైములోనూ పిల్లలు వచ్చి చిన్న ప్రదేశం (ఒక తలుపు) నుండి చూస్తుంటే “ఆజన్మ ఖైదీలు” గుర్తుకొచ్చేవారు. కొంత గడుసు పిల్లలైతే ఫరవాలేదుకానీ, నోట్లో నాలుకలేని పిల్లలైతే ఇక అంతే సంగతులు.
ఏదైనా అవసరానికో, షాపింగుకో పిల్లలని బయటికి తీసుకెల్లాలంటే పర్మిషన్‌కోసం నాలుగంచెల వ్యవస్థ ఉంటుంది. ఒకో స్థాయిలో ఒక్కొక్కరు మనకు సమయం విలువను మనకు గుర్తుచేస్తుంటారు. మనం అడుగు బయటపేట్టీ పెట్టాగానే లోపలికి రావలన్నట్టుగా ఉండెవి వారి మాటలు. కొన్ని సందర్భాలలో తల్లితంద్రులని చూసి పర్మిషన్ ఇచ్చినా, ఇచ్చేముందు పిల్లలని పిలిచి వారు ఎలా సమయం వృధా చేస్తున్నారో క్లాసు పీకేవారు. దానితో వారికి ఆ కాసేపు కూడా బయటకు వచ్చిన ఆనందం ఉండేది కాదు. బయట ఉన్నంతసేపుకూడా అన్యమనస్కంగానే ఉండేవారు. ఒకట్రెండు సంధర్భాలలో మా పాప ఏడుపు మొహంతో బయటికి వచ్చి పర్మిషన్ కాన్సిల్ చేయమన్నది. అంతలా ఉండేది వీరి Brain Wash.
రెండొ సంవత్సరం చేయించాల్సిన ప్రయోగాలు కేవలం ఒక్కటంటే ఒక్కరోజులో పూర్తి చేసారు. అదేమిటని అడిగితే ఒక వేదాంతి పల్లెటురి బైతుని చూసినట్టు చూసి, పరీక్షలలో ఇబ్బంది కాకుండా చూసుకుంటామండీ అన్నారు. మళ్ళీ రెండవసంవత్సరానికి యధావిధిగా ధోభీ ఫీజు (వాడుకోకపోయినా), పరిక్షల సమయంలో విద్యార్థుల తరలింపునకు మరొక 900, ప్రయోగశాల ఫీజు (ఎంతో నాకు సరిగ్గా గుర్తు లేదు) ఇందులో కొంత పరీక్షకుడికి (మంచి మార్కులు వేయడానికట) మొదలైనవన్నీ కట్టించుకొనిగానీ హాల్ టికెట్ ఇవ్వలేదు.
ఎంసెట్ ముందయితే రోజూ పరీక్షలు పెట్టేవారు. వారి క్యాంపస్ రాంకు ఎంత, అన్ని బ్రాంచీలలో కలిపి రాంకు ఎంత, వచ్చే రాంకుకు సీటు వస్తుందా రాదా? రాంకు తక్కువగా వచ్చేవారిని ఉత్సారపరిచేకన్నా ఎక్కువగా నిరుత్సాహపరిచి భయపెట్టేవారట. ఇక లెక్చరర్లు కూడా వారి సబ్జెక్ట్లో ఎక్కువ మార్కులొస్తాయన్నట్టుగా చెప్పేవారట.
కాబట్టి నాకు అర్థమయిందేమింటంటే, ఈ కాలేజీలలో మామూలు కాలేజీలలో లేని గొప్ప సౌకర్యాలేమీ లేవు. కేవలం పుస్తకం తప్ప మరొక ఆలోచన రానివ్వకపోవడం వల్ల అక్కడ రోబోట్లవంటి విద్యార్థులు తయారవుతున్నారు. వారి దృష్టి పూర్తిగా “చదవగలిగినవారిమీదనే” తప్ప మామూలు విద్యార్థిని రాంకు స్థాయికి తీసుకెల్లగలిగిన ఓపికగానీ, విధానంగానీ, విద్యా వ్యవస్తగానీ లేవు. సాధారణ స్థాయి విద్యార్థికి అక్కడ ప్రోత్సాహం దొరికిన దాఖలాలేమీ లేవు. కేవలం IPE పరీక్షలో “ఇంకొంచం” మంచి మార్కులొస్తాయేమో. అదే విధంగా ఇంట్లో చదివినా ఆ మార్కులు గ్యారంటీగా వస్తాయి.
TV లాంటివాటినుండి దృష్టి మరల్చలేని విద్యార్థులు అక్కడ కొంతవరకూ రాణించవచ్చు (ఇతర వ్యాపకాలేవీ ఉండవు కాబట్టి). ఐతే ఇటువంటివారు అక్కడ “సర్దుకొనే” అవకాశాలూ తక్కువే. అటువంటి సంధర్భంలో మీ డబ్బులమీద ఆశ వదులుకోవాల్సిందే. బలవంతంగా అక్కడే ఉంచేస్తే అసలుకే మోసం వచ్చిన సంధర్భాలూ కోకొల్లలు. సాధారణ మానసిక స్థితి ఉన్నవారూ, స్వేచ్చా వాతావరణంలో చదువుకున్నవారూ ఇక్కడ సర్దుకుపోవడం చాలా కష్టం.
కబట్టి, ఏజంట్ల మాటను గుడ్డిగా నమ్మకుండా పైన వ్రాసిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మీ సందేహాలను తిర్చుకున్న తరువాతనే నిర్ణయం తీసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here