CRITICS METER
Average Critics Rating: 0
Total Critics:0
AUDIENCE METER

Average Critics Rating: 0
Total Critics:0
నటీనటులు: రవితేజ, మాళవిక శర్మ, జగపతిబాబు, కౌముది, శరత్ కుమార్, సంపత్..
ఎడిటింగ్: ఛోటా కే ప్రసాద్
సంగీతం: శక్తికాంత్ కార్తిక్
స్క్రీన్ ప్లే: సత్యానంద్
నిర్మాత: రామ్ తళ్లూరి
కథ, మాటలు, దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ కురసాల
రవితేజ సినిమా అంటే కచ్చితంగా ఎంటర్ టైన్మెంట్ పక్కా అనే నమ్మకంతో ఉంటారు ప్రేక్షకులు. ఆయన చాలా కాలం నుంచి అది అందిస్తూనే ఉన్నారు కూడా. ఇప్పుడు నేలటికెట్ అంటూ పక్కా మాస్ సినిమాతో వచ్చారు ఈ హీరో. మరి ఇప్పుడు కూడా ప్రేక్షకుల అంచనాలు అందుకున్నారా.. మాస్ రాజా కోరుకున్న విజయం ఈ చిత్రం అందించిందా..?
కథ:
సిఎం ఆనంద భూపతి(శరత్ కుమార్) తన కొడుకు ఆదిత్య భూపతి(జగపతిబాబు)ను హోమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేయించి తిరిగి వస్తుంటే హత్యకు గురవుతాడు. ఆ హత్య కేస్ లో రిపోర్టర్ గౌతమి (కౌముది) కీలక సాక్ష్యాలు సేకరిస్తుంది. అదే సమయంలో విశాఖపట్నంలో దొంగ సాక్ష్యాలు చెప్పుకుంటూ ఉంటాడు రవితేజ. తనతో పాటు అతడి చుట్టూ ఉన్న స్నేహితులు కూడా అనాధలే. చుట్టూ ఉన్న వాళ్లను ఆనందంగా ఉంచాలనుకుంటాడు రవితేజ.
అలాంటి వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో హైద్రాబాద్ రావాల్సి వస్తుంది. రాగానే మాళవిక(మాళవిక శర్మ)తో ప్రేమలో పడతాడు. ఆమె కోసం తిరిగి ప్రేమలో పడేస్తాడు. అదే సమయంలో హోమ్ మినిస్టర్ ఆదిత్య భూపతి(జగపతిబాబు) తో గొడవ పెట్టుకుంటాడు. అందరి ముందు ఆయనకు వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ఆ తర్వాత రవితేజ జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి.. అసలేంటి ఆ సంఘటనలు..? అసలు రిపోర్టర్ గౌతమి(కౌముది)తో రవితేజకు ఏంటి సంబంధం అనేది మిగిలిన కథ..
కథనం:
రవితేజ సినిమాలంటే కాసిన్ని నవ్వులు ఖాయమనే నమ్మకం ఉండేది. కథతో పనిలేకుండా మినిమమ్ ఎంటర్ టైన్మెంట్ ఇస్తాడనే కాన్ఫిడెన్స్ ఉండేది. కానీ ఇప్పుడు అది మెల్లగా పోతుందేమో అనిపిస్తుంది. ఈయన చేస్తోన్న సినిమాలు చూస్తుంటే ఇదే అనుమానం వస్తుందిప్పుడు.
నేలటికెట్ తో ఇది మరోసారి ప్రూవ్ అయిపోయింది. కొన్నిసార్లు తెలిసిన కథలనే పక్కా స్క్రీన్ ప్లేతో నిలబెట్టొచ్చు. కానీ కళ్యాణ్ కృష్ణ ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యాడనిపించింది. సీనియర్ రైటర్ సత్యానంద్ ఇచ్చిన స్క్రీన్ ప్లే ఈ చిత్రానికి ఏ మాత్రం హెల్ప్ కాలేదు. చుట్టూ జనం.. మధ్యలో మనం అనేది మంచి కాన్సెప్ట్ కానీ ట్రీట్మెంట్ కుదర్లేదు. అప్పటికే ఎన్నోసార్లు వాడేసిన కథకు మరింత రొటీన్ స్క్రీన్ ప్లే మైనస్ గా మారింది.
రవితేజ తన వరకు సినిమాను నిలబెట్టే ప్రయత్నం శతవిధాలా చేసాడు. కానీ కథ సహకరించకపోతే పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు..? ఒకప్పుడు రవితేజ సినిమాల్లో సందర్భానుసారంగా వచ్చే కామెడీ ఉండేది.
కానీ నేలటికెట్ లో బలవంతంగా కామెడీ చేస్తోన్న నవ్వు రాలేదు సరికదా.. ఎందుకు రవితేజకు ఇలాంటి సినిమాలు దేవుడా అనిపిస్తుంది. బలవంతంగా ఇరికించిన కామెడీ.. అసందర్భంగా వచ్చే పాటలు..సాగుతూ పోయే కథ.. అన్నీ నేలటికెట్ కు మైనస్ గా మారాయి. దాంతో ఈ రాజా ది గ్రేట్ ను ఇప్పుడు టచ్ చేయాలన్నా భయమేస్తుంది. మొత్తంగా రవితేజ చెప్పిందే.. నేలటికెట్ గాళ్ళతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు.
బ్రహ్మానందం ఎందుకు ఈ చిత్రంలో ఉన్నాడో దర్శకుడు కళ్యాణ్ కు అయినా క్లారిటీ ఉందో లేదో మరి..? కథతో సంబంధం లేకుండా పృథ్వీ అండ్ బ్యాచ్ తో కామెడీ వస్తుంది. అది కూడా నవ్వించలేని కామెడీ. హోమ్ మినిస్టర్ తో గొడవ కూడా ఊహించినట్లుగానే ఉంటుంది. హీరో, విలన్ మధ్య సరైన వైరం కూడా చూపించడు దర్శకుడు. రియాలిటీకి మరీ దూరంగా ఉండే సన్నివేశాలు కూడా ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. సందేశాన్ని ఇవ్వాలనుకున్నా అది సరైన దారిలో వెళ్లకపోయేసరికి విజిల్స్ వేయించుకునే సబ్జెక్ట్ కాస్తా నేలకు జారిపోయింది.
నటీనటులు:
రవితేజ నటనకు పేరు పెట్టాల్సిన పనిలేదు. ఆయన ఎప్పట్లాగే చంపేసాడు. అనాధగా మొదలై.. చుట్టూ పదిమంది చేరిపోయే వరకు తన పాత్రను బాగానే రక్తి కట్టించాడు మాస్ రాజా. కానీ కథే ఆయనకు సహకరించలేదు. ఇక హీరోయిన్ మాళవిక అనుకున్నట్లుగానే కేవలం అందాల ఆరబోతతో పాటు పాటలకు పనికొచ్చింది. రవితేజ చెల్లిగా కౌముది పర్లేదు. జగపతిబాబు విలన్ గా రొటీన్ అనిపించాడు. కొత్తగా అయితే ఏం లేదు కానీ బాగానే చేసాడు. శరత్ కుమార్ గెస్ట్ అప్పియరెన్స్ బాగుంది. హీరో ఫ్రెండ్స్ గా అలీ, ప్రియదర్శి, ప్రవీణ్ బాగా చేసారు. మిగిలిన వాళ్లంతా ఓకే..
టెక్నికల్ టీం:
నేలటికెట్ కు అతిపెద్ద మైనస్ మ్యూజిక్. ఫిదాకు అదిరిపోయే సంగీతం అందించిన శక్తికాంత్ కార్తిక్ ఈ సారి మాత్రం పూర్తిగా తేలిపోయాడు. పూర్తిగా మాస్ సబ్జెక్ట్ కావడంతో తన మార్క్ చూపించలేదు. సినిమాటోగ్రఫీ పర్లేదు. ఎడిటింగ్ వీక్.. ఎందుకంటే మూడు గంటల సినిమా చూడలేరు ప్రేక్షకులు. మధ్యలో కొన్ని సీన్లు బోర్ కొట్టించేసాయి. అసలు బ్రహ్మానందం ఎందుకున్నాడో ఎవరికీ అర్థం కాదు. కథ మంచిదే కానీ కథనం బాగోలేదు. తెలిసిన కథే కావడంతో కళ్యాణ్ కృష్ణ కొత్త ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది.. కానీ లేదు అందుకే సినిమా కూడా నేలటికెట్ మాదిరి నాసీరకంగానే ఉంది. ప్రొడక్షన్ వైజ్ గా మాత్రం సినిమా రిచ్ అనిపించింది.
చివరగా:
నేలటికెట్.. కుల్లంకుల్ల ఫ్రీ టికెట్స్.. రండి బాబూ రండి..!