CRITICS METER
Average Critics Rating: 0
Total Critics:0
AUDIENCE METER

Average Critics Rating: 0
Total Critics:0
రివ్యూ: శ్రీనివాస కళ్యాణం
నటీనటులు: నితిన్, రాశీఖన్నా, నందితాశ్వేత, ప్రకాశ్ రాజ్, జయసుధ, రాజేంద్రప్రసాద్, నరేష్..
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకుడు: సతీష్ వేగేశ్న
నిర్మాతలు: రాజు-శిరీష్-లక్ష్మణ్
శ్రీనివాస కళ్యాణం.. కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ఈ సినిమా గురించి చర్చ బాగా జరుగుతుంది. దానికి కారణం దిల్ రాజు. పైగా శతమానం భవతి లాంటి సినిమా తర్వాత సతీష్ వేగేశ్న తెరకెక్కించిన సినిమా కావడం. ట్రైలర్.. టీజర్స్.. పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా కూడా ఇలాగే ఉంటుందని అంచనా వేసుకున్నారు ప్రేక్షకులు. మరి వాళ్ల ఊహకు తగ్గట్లుగానే సినిమా ఉందా..?
కథ:
శ్రీనివాస్(నితిన్) ది ఉమ్మడి కుటుంబం. చిన్ననాటి నుంచి కుటుంబ విలువలు చూస్తూ పెరుగుతాడు. ఇంటికి దూరంగా చంఢీగర్ లో ఉద్యోగం చేస్తున్నా రోజూ ఇంటివాళ్లతో మాట్లాడకుండా ఉండలేడు. ఇంత ఫ్యామిలీ వ్యాల్యూస్ తెలిసిన శ్రీనివాస్ లైఫ్ లోకి టైమ్ తప్ప కుటుంబ బంధాలకు అస్సలు విలువ ఇవ్వని వ్యాపారవేత్త ఆర్కె (ప్రకాశ్ రాజ్ ) కూతురు శ్రీదేవి(రాశీఖన్నా) వస్తుంది. శ్రీదేవి మాత్రం శ్రీనివాస్ ను కుటుంబ విలువలు చూసి అతన్ని ఇష్టపడుతుంది. కానీ ఆర్కె మాత్రం పెళ్లి జరగాలంటే ఓ అగ్రిమెంట్ అడుగుతాడు శ్రీనివాస్ ను. అదేంటి.. ఇంతకీ పెళ్లికి ఏం అడ్డు చెప్పాడు అనేది మిగిలిన కథ..
కథనం:
ఏడడుగులు.. మూడు ముళ్లు.. రెండు కుటుంబాలు.. వెలకట్టలేని అనుబంధాలు.. ఇద్దరు మనషులు.. ఒక్కజంట.. పెళ్లి అనే రెండక్షరాలలో ఇంత పెద్ద కథ ఉంది.. దాని వెనక తీపికష్టం ఉంది. శ్రీనివాస కళ్యాణంలోనూ దర్శకుడు సతీష్ వేగేశ్న చూపించాలనుకున్నది ఇదే. అయితే తాను చెప్పాలనుకున్న కథను నెమ్మదిగా మొదలుపెట్టాడు దర్శకుడు. ఫస్టాఫ్ లో పెద్దగా ఎగ్జైటింగ్ గా అనిపించే అంశాలేం లేకుండా.. కేవలం సంప్రదాయం అంటూ క్లాసులు ఇచ్చాడు దర్శకుడు సతీష్. ఇంటర్వెల్ ముందు వరకు కూడా తెరనిండా నటుల్ని చూపించాడు కానీ వాళ్లను వాడుకోలేదు. ఓ వైపు శతమానం భవతి దర్శకుడు.. మరోవైపు దిల్ రాజు.. సినిమా గురించి వాళ్లు చెప్పిన గొప్పలు.. దానికి తగ్గట్లు విజువల్స్.. అన్నప్రేక్షకుల్లో చాలా ఆసక్తి.. అంచనాలు రేకెత్తించాయి. కానీ సినిమా మొదలైన తర్వాత కాస్త ఎక్కువ చెప్పుకున్నారేమో.. అనవసరంగా అంచనాలు పెంచేసేరామో అనిపించింది.
పెళ్లికి ముందు పనులన్నీ చక్కబెట్టడానికి ఇంటర్వెల్ వరకు టైమ్ తీసుకున్న దర్శకుడు.. ఒక్కసారి పెళ్లి తంతు మొదలైన తర్వాత క్లైమాక్స్ వరకు ఎక్కడా ఆగలేదు. సెకండాఫ్ మొదలయ్యాక అప్పుడు అనిపించింది.. రాజుగారు చెప్పిందాంట్లో నిజం ఉందని.. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు.. పద్దతులు పాతవే అయినా తెరపై చూస్తుంటే కొత్తగా అనిపించింది. నిజమే.. పెళ్లంటే ఈవెంట్ లా మారిపోయిన ఈ రోజుల్లో.. ఇంతపెద్ద తంతు ఉంటుందని ఈ తరం వాళ్లకు చాలా మందికి తెలియదు. పెళ్లిలో జరిగే ఒక్కో విషయాన్ని విపులంగా చెప్పి.. మూడుముళ్ల గొప్పతనం చెప్పాడు సతీష్ వేగేశ్న. క్లైమాక్స్ సినిమాకు ప్రాణం.. నితిన్ డైలాగ్స్ తో పాటు ప్రకాశ్ రాజ్ డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. శతమానం భవతితో పిల్లలకు దూరంగా ఉండే పేరెంట్స్ బాధ చూపించిన సతీష్.. ఈ సారి పెళ్లిని ఓ ఈవెంట్ లా తీసుకుంటున్న ఈ తరానికి కనువిప్పు కలిగించే ప్రయత్నం చేసాడు.
నటీనటులు:
నితిన్ తన పాత్ర వరకు బాగానే చేసాడు. తొలిసారి ఇంత భారీ సినిమాలో.. ఇంత మంది నటులతో కనిపించాడు నితిన్. రాశీఖన్నా క్యూట్ గా అనిపించింది. మరదలి పాత్రలో నందిత శ్వేత బాగా నటించింది. ప్రీ క్లైమాక్స్ లో ఈమె పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఇచ్చాడు దర్శకుడు. ప్రకాశ్ రాజ్, రాజేంద్రప్రసాద్ పాత్రలు బాగున్నాయి.. జయసుధ ఎప్పట్లాగే బాగుంది.
టెక్నికల్ టీం:
శ్రీనివాస కళ్యాణంకు ప్రధాన హైలైట్ మిక్కీ జే మేయర్ సంగీతం. ఈయన పాటలు బాగున్నాయి. ముఖ్యంగా టైటల్ సాంగ్ కు తోడు విడుదల చేయని పల్లెటూరి పాట బాగుంది. విజువల్స్ కూడా చక్కగా కుదిరాయి. కెమెరామెన్ సమీర్ రెడ్డి అద్భుతమైన పనితీరు తెరపై కనిపించింది. శ్రీమణి లిరిక్స్ అర్థవంతంగా అనిపించాయి. పెళ్లిపాట ఇప్పటికే చాలా పెద్ద హిట్ అయింది. మధు ఎడిటింగ్ వీక్. ఫస్టాఫ్ నెమ్మదిగా వెళ్ళడం సినిమాకు మైనస్. పాత కథే కావడంతో రొటీన్ స్క్రీన్ ప్లే అనిపించింది. దిల్ రాజు నిర్మాణ విలువలు సూపర్. శతమానం భవతికి రైటర్ గానూ సత్తా చూపించిన సతీష్.. ఈ సారి మాత్రం అంత మార్క్ చూపించలేదు. దర్శకుడిగానూ యావరేజ్ మార్కులతో సరిపెట్టుకున్నాడు.
చివరగా:
శ్రీనివాస కళ్యాణం.. ఓ మంచి సినిమా.. కానీ నెమ్మది నెమ్మది నెమ్మదిగా..!