ఫిదా విజయం సాధించిందనో.. ఇప్పుడు తొలిప్రేమ కూడా ఆడిందనో కాదు కానీ వరుణ్ తేజ్ మరో కారణంతో గాల్లో తేలిపోనున్నాడు. ఈ కుర్ర హీరో ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఫిదా సక్సెస్ తర్వాత వరుణ్ తేజ్ మార్కెట్ కూడా బాగానే పెరిగింది. ఇక తొలిప్రేమ కూడా 24 కోట్లు వసూలు చేసింది. దాంతో మనోడితో భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు నిర్మాతలు. ఇందుకే ఆనందంగా ఉన్నాడు వరుణ్ తేజ్. ఈ కుర్ర హీరో ఏకంగా 30 కోట్ల బడ్జెట్ ఉన్న సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. అది కూడా ఘాజీ లాంటి సంచలన సినిమా అందించిన సంకల్ప్ రెడ్డితో. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా కన్ఫర్మ్ అయి చాలా కాలమైంది. ఇప్పుడు దానికి కార్యరూపం వచ్చింది. ఈ చిత్రం ఎప్రిల్ ఎండ్ నుంచి షూటింగ్ మొదలు కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కోసం శిక్షణ తీసుకుంటున్నాడు వరుణ్ తేజ్. స్పేస్ నేపథ్యంలో తెరకెక్కబోయే సినిమా కాబట్టి ఆ మధ్య కజకిస్థాన్ వెళ్లి జీరో గ్రావిటీలో శిక్షణ తీసుకున్నాడు వరుణ్ తేజ్. రాజవ్ రెడ్డి.. సాయిబాబా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వరుణ్ తేజ్ కు జోడీగా లావణ్య త్రిపాఠి.. అదితిరావ్ హైద్రీ నటిస్తున్నారు. ఇలాంటి కథతో ఇప్పుడు తమిళనాట టిక్ టిక్ టిక్ అనే సినిమా వస్తుంది. ఇప్పుడు తెలుగులో మరో సినిమా ఇలాంటిదే వస్తుండటం విశేషం. తొలి సినిమాతోనే ఇండియా వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ కుర్రాడు ఇప్పుడు వరుణ్ తేజ్ తో కలిసి ఏం చేస్తాడో చూడాలిక..!