శ్రీ‌దేవి చుట్టూ అస‌లేం జ‌రుగుతుంది..?

SRIDEVI TOTLA DUBAI ARTICLE
ఎలాంటి శ్రీ‌దేవికి ఎలాంటి గ‌తి ప‌ట్టింది..? ఇప్పుడు స‌గ‌టు సినీ అభిమాని ఫీల్ అవుతున్న మాట‌లు ఇవే. అయ్యో పాపం.. అనుకోకుండా ఉండ‌లే క‌పోతున్నారు ఇప్పుడు శ్రీ‌దేవి ప‌రిస్థితి చూసి. దేశం కాని దేశంలో వెళ్లి ఓ బాత్ ట‌బ్ లో ప‌డి ప్రాణాలు కోల్పోవ‌డం అనేది విషాదానికే విషాదం. అదే ఘోరం అనుకుంటే.. చ‌నిపోయిన మూడు రోజుల త‌ర్వాత కూడా కావాల్సిన వాళ్లు క‌డ‌సారి చూపుల‌కు కూడా నోచుకోలేని ప‌రిస్థితుల్లో ఆ దుబాయ్ లోనే శ్రీ‌దేవి భౌతిక‌కాయం ఉంది చూడండి.. అది మ‌రింత దారుణంగా మారిపోయింది.
ఇప్ప‌టికే శ్రీ‌దేవి మ‌ర‌ణంపై అనుమానాలు లేవ‌నెత్తిన దుబాయ్‌ పబ్లిక్ ప్రాసిక్యూషన్ రీ ఇన్విస్టిగేషన్ మొద‌లుపెట్టింది. ఈ క్ర‌మంలోనే శ్రీ‌దేవి భ‌ర్త బోనీక‌పూర్ ను ప్ర‌శ్నిస్తున్నారు. ఆయ‌న చెప్పిన స‌మాధానాలు పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు సంతృప్తి ఇస్తేనే ఆయ‌న ఇండియా వ‌స్తాడు. ఇప్ప‌టికే ఓ సారి ఆయ‌న చెప్పిన స‌మాధానాల‌కు వాళ్లు పెద్ద‌గా సంతృప్తి చెంద‌లేదు. వివాహమైన తర్వాత ముంబైకి తిరిగొచ్చిన బోనీ.. మళ్ళీ దుబాయ్‌కి ఎందుకు వెళ్ళాడు.. అనేది ఇప్పుడు మిస్ట‌రీగా మారింది. ఆయన స‌ర్ ప్రేజ్ ఇవ్వ‌డానికి అని చెబుతున్నాడు. కానీ వెన‌క ఇంకేదైనా జ‌రిగిందా అని   ఇప్పుడు అక్క‌డి పోలీసులు ఆరా తీస్తున్న స‌మ‌స్య‌.
త‌న మేన‌ల్లుడి పెళ్లి కోసం 10 రోజుల కింద భార్యతో క‌లిసి దుబాయ్ వెళ్లాడు బోనీక‌పూర్. అక్క‌డే ఉండి పెళ్లి అయిన త‌ర్వాత చిన్న కూతురు ఖుషీ క‌పూర్ తో క‌లిసి ఇండియాకు వ‌చ్చాడు. మ‌ళ్లీ వెళ్లాడు. ఆ వెళ్లిన రోజు రాత్రే అంటే ఫిబ్ర‌వ‌రి 24నే శ్రీ‌దేవి గుండెపోటుతో చ‌నిపోయింద‌ని చెప్పాడు బోనీక‌పూర్. కానీ రెండు రోజుల త‌ర్వాత గుండెపోటు కాదు.. బాత్‌టబ్‌లో మునగడం వల్లే శ్రీ‌దేవి చ‌నిపోయింద‌ని డాక్ట‌ర్లు ఫోరెన్సిక్ తో షాక్ ఇచ్చారు. దాంతో దుబాయ్ పోలీసులు నిజాలను బ‌య‌టికి తెచ్చే ప‌నిలో ఉన్నారు ఇప్పుడు.
ముంబై నుండి బోనికపూర్ మళ్ళీ దుబాయ్‌ ఎందుకు వెళ్ళాడు.. వివాహం కోసం దుబాయ్ వెళ్ళిన బోనీ చిన్న కూతురుతో కలిసి ముంబైకి తిరిగి ఎందుకు వచ్చాడు..? ఇవ‌న్నీ ఆ ప్రాసిక్యూష‌న్ ప్ర‌శ్నిస్తుంది. ఫిబ్రవరి 24వ తేదీ రాత్రి శ్రీ‌దేవికి బోనీక‌పూర్ ప్లాన్ చేసిన స‌ర్ ప్రైజ్ ప్లాన్ ఏంటి అనేది కూడా ఇప్పుడు దుబాయ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ రోజు రాత్రి బోనీ దుబాయ్‌కి వెళ్లిన త‌ర్వాత‌.. శ్రీ‌దేవి చ‌నిపోవ‌డానికి మ‌ధ్య‌లో మూడు గంట‌లు ఉంది. ఆ మూడు గంట‌లే ఇప్పుడు బోనికపూర్ జీవితానికి చాలా కీల‌కంగా మారాయి. బోనికపూర్, శ్రీదేవికి మధ్య ఏదైనా గొడ‌వ‌లు ఉన్నాయా అనేది కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు.
అయితే బోనీ క‌పూర్ ప‌రిస్థితి ఎలా ఉన్నా కూడా ఇప్పుడు శ్రీ‌దేవి భౌతిక‌కాయం ఇంకా దుబాయ్ లోనే ఉంది. ఇది రావ‌డానికి మ‌రో రోజు కూడా ప‌ట్టేలా ఉంది. అక్క‌డి రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయ‌ని తెలుసు.. కానీ మ‌రీ ఇంత అనీ ఎవ‌రూ అనుకోలేదు. పూట‌కో మ‌లుపు తిరుగుతూ అతిలోక‌సుంద‌రి బాడీని అక్క‌డే ఉంచుకున్నారు దుబాయ్ పోలీసులు. అస‌లు శ్రీ‌దేవిని బాత్‌టబ్‌లో స్పృహ లేని ప‌రిస్థితుల్లో చూసిన‌పుడు డాక్ట‌ర్ కు ఎందుకు బోనీ క‌పూర్ ఫోన్ చేయ‌లేద‌నే విష‌యం కూడా ఇప్పుడు వెలుగులోకి వ‌స్తుంది. ఈ విష‌యంపైనే హోట‌ల్ సిబ్బందితో పాటు బోనీని కూడా ప్ర‌త్యేకంగా విచారిస్తున్నారు దుబాయ్ పోలీసులు.
శ్రీదేవి గ‌త వారం రోజులుగా మాట్లాడిన ఫోన్‌కాల్‌ రికార్డులతో పాటు హోటల్‌ సీసీటీవీ ఫూటేజ్‌ మొత్తం తనకు అప్పగించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ అల్‌ నయీబ్ ఇప్ప‌టికే ఆదేశించారు. అంతేకాదు.. చ‌నిపోయిన‌పుడు శ్రీ‌దేవి బాడీలో ఆల్క‌హాల్ ఉంద‌ని పోలీసులు చెబుతున్నారు. కానీ ఆమెకు మందు తాగే అల‌వాటు లేద‌ని ఆమె స‌న్నిహితులు చెబుతున్నారు. ఒక‌వేళ నిజంగానే తాగింది అనుకున్నా కూడా బాత్ ట‌బ్ లో ప‌డితే క‌నీసం అర‌వ‌దా..? ఆ స‌మ‌యంలో నిజంగానే రూమ్ లో ఎవ‌రూ లేరా..? అన్ని వేల సార్లు బాత్ ట‌బ్ అల‌వాటున్న శ్రీ‌దేవికి అందులోంచి ఎలా బ‌య‌టికి రావాలో కూడా తెలియ‌దా..? ఇలా ఎన్నో అనుమానాలున్నాయి ఇప్పుడు శ్రీ‌దేవి మ‌ర‌ణంపై.
పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణలో రాజు కూడా జోక్యం చేసుకోలేడు. అంత స్ట్రిక్ట్ గా ఉంటాయి దుబాయ్ రూల్స్. అందుకే తంతు త్వ‌ర‌గా ముగియ‌డం లేదు. వాళ్లు చెప్పిన‌ట్లుగా వినాల్సిందే. అక్క‌డ ఆప్ష‌న్ కూడా లేదు. గల్ఫ్‌ చట్టాల ప్రకారం విచారణలో ఉన్న అంశాలను అక్క‌డి అధికారులు ఎవ‌రితోనూ పంచుకోరు. మొత్తానికి ఇప్పుడు ప‌రిస్థితులు ఎలా ఉన్నా కూడా శ్రీ‌దేవి లాంటి ఓ లెజెండ్ కు మాత్రం ఇలాంటి చావు రావ‌డం నిజంగా ఆమె అభిమానులే కాదు సగ‌టు సినీ ప్రేక్ష‌కుడు కూడా జీర్ణించుకోలేక‌పోతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here