సాహో.. 150 కోట్ల అణుబాంబ్..

అదేంటి.. సాహో అణుబాంబ్ ఏంటి.. అది ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా క‌దా.. పైగా బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ చేస్తోన్న సినిమా.. ఇండియా అంతా ఈ చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారు.. ఇలాంటి టైమ్ లో సాహో అణుబాంబ్ అంటారేంటి అనుకుంటున్నారా..? అవును.. సాహో క‌మ‌ర్షియ‌ల్ సినిమానే కానీ కాస్త ఆలోచిస్తే అది ప్ర‌యోగ‌మా లేదంటే ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమానా అనేది మ‌న‌కే అర్థ‌మ‌వుతుంది. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ నుంచి వ‌స్తోన్న సినిమా కావ‌డంతో సాహోపై ఇప్పుడు ఇండియా మొత్తం చ‌ర్చ న‌డుస్తుంది. మ‌రీ ప్ర‌త్యేకంగా బాలీవుడ్ లోనూ సాహోపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. అందుకే ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా 150 కోట్ల‌తో ఈ చిత్రం నిర్మిస్తున్నారు యువీ క్రియేష‌న్స్. ద‌ర్శ‌కుడు కొత్త‌వాడే అయినా కూడా క‌థ‌పై న‌మ్మ‌కంతో ముందుకెళ్తున్నారు. న భూతో న భవిష్య‌తీ అనేంత‌గా ఈ సినిమాలో స్టంట్స్ ఉండ‌బోతున్నాయని తెలుస్తోంది. అంతా బాగానే ఉంది కానీ సాహోకు నేటివిటి మిస్సైపోతుందేమో అనే అనుమానాలు వ‌స్తున్నాయి ఇప్పుడు.
ఈ చిత్ర తొలి షెడ్యూల్ ఇప్ప‌టికే పూర్త‌యింది. డిసెంబ‌ర్ 20 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలోనే మ‌రో షెడ్యూల్ ప్లాన్ చేసారు. అక్క‌డే జ‌న‌వ‌రి 9 వ‌ర‌కు షూటింగ్ జ‌ర‌గ‌నుంది. ఆ త‌ర్వాత దుబాయ్ లో నెక్ట్స్ షెడ్యూల్ కు రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు సుజీత్, సినిమాటోగ్ర‌ఫ‌ర్ మ‌ది.. స్టంట్ మాస్ట‌ర్ కెన్నీబేట్స్ దుబాయ్ కు వెళ్లారు. అక్క‌డే లొకేష‌న్ల వేటలో ఉన్నారు. అక్క‌డి ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత‌ బూర్జ్ ఖ‌లీఫా ద‌గ్గ‌ర భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నాడు సుజీత్. జ‌న‌వ‌రి చివ‌ర్లో దుబాయ్ షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. అక్క‌డే నెల రోజుల పాటు ఉండ‌బోతున్నారు సాహో యూనిట్. ఏకంగా 20 నిమిషాల పాటు ఉండే ఈ సీక్వెన్స్ ను హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ కెన్నీబేట్స్ ఆధ్వ‌ర్యంలో చిత్రీక‌రించ‌నున్నారు. హాలీవుడ్ సినిమాలు మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కు బూర్జ్ ఖ‌లీఫా ద‌గ్గ‌ర షూట్ చేసుకున్నాయి. ఇప్పుడు సాహో ఈ జాబితాలో చేరబోతుంది.
ఇన్ని ఉన్నా కూడా ఒక్క‌టి మాత్రం సాహోను ఇబ్బంది పెడుతుంది. అదే నేటివిటీ స‌మ‌స్య. కావాలంటే చూడండి.. ప్ర‌భాస్ మిన‌హాయిస్తే సాహోలో అంతా బ‌య‌టి నుంచి తెచ్చుకున్న వాళ్లే క‌నిపిస్తున్నారు. శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్.. నీల్ నితిన్ ముఖేష్, జాకీష్రాఫ్, అరుణ్ విజ‌య్ విల‌న్లు.. ఇక మందిరాబేడీ కూడా విల‌న్ గా జాయినైంది. పైగా ఈ చిత్రానికి సంగీతం కూడా శంక‌ర్ ఎహ‌సాన్ లాయ్.. స్టంట్స్ అక్క‌డి వాళ్లే.. అంతా బాలీవుడ్ సంతే ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. హిందీ మార్కెట్ పై ఎక్కువ‌గా దృష్టిపెడితే మంచిదే.. కానీ మొత్తం అక్క‌డే దృష్టి పెడితే అస‌లు మార్కెట్ దెబ్బ తింటుందేమో అనే విష‌యంపై అస్స‌లు ఆలోచించ‌ట్లేదు సాహో యూనిట్. కొండ‌నాలిక‌కు మందేస్తే.. ఉన్న నాలిక ఊడింద‌న్న‌ట్లు.. బాలీవుడ్ బాలీవుడ్ అంటూ ఇక్క‌డి నేటివిటీని మిస్ అవుతున్నారు సాహో యూనిట్. చూడాలిక‌.. చివ‌రికి ఏం జ‌రుగుతుందో ఇది..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here