కమెడియన్ గా ఉన్నపుడు ఆయన రాజు.. కానీ ఏం చేస్తాం.. ఒక్క నిర్ణయం ఆయన్ని మళ్లీ మామూలు మనిషిని చేసింది. ఇప్పుడు సునీల్ కెరీర్ ఎటు వెళ్తుందో తెలియని చుక్కాని లేని నావలా అయిపోయింది. నడిసంద్రంలో ఉంటూ తీరమెటో తెలియక దిక్కులు చూస్తున్నాడు ఈయన. ఈ సమయంలో ఈయన కెరీర్ ఒడ్డున పడాలంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ పడాలి. కానీ అది ఇచ్చే దర్శకుడు ఎవరో.. సినిమా ఏంటో తెలియడం లేదు ఈ హీరోకు. ప్రస్తుతం సునీల్ ఆశలన్నీ 2 కంట్రీస్ పైనే ఉన్నాయి. ఎన్ శంకర్ దీనికి దర్శకుడు. మళయాలంలో సూపర్ హిట్టైన 2 కంట్రీస్ ను అదేపేరుతో ఇక్కడ రీమేక్ చేసారు. తాజాగా ట్రైలర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత సునీల్ ఏమీ మారలేదనే సంగతి అర్థమైపోయింది. అంటే అదే కామెడీతో వచ్చాడని అర్థం.
ట్రైలర్ చూస్తుంటే కొత్తగా అయితే ఏం అనిపించలేదు. పల్లెటూరి అబ్బాయి.. అమెరికా అమ్మాయి పెళ్లి చేసుకోవడం.. అక్కడికి వెళ్లడం.. చిన్న చిన్న గొడవలు రావడం.. ఆ తర్వాత ఎలా కలుసుకున్నారు అనేది 2 కంట్రీస్ కథ. సింపుల్ కథనే ఎంటర్ టైనింగ్ గా చెప్పడానికి ప్రయత్నించాడు శంకర్. ఈ చిత్రం పైనే ఇప్పుడు సునీల్ ఆశలన్నీ ఉన్నాయి. డిసెంబర్ 29న సినిమా రానుంది. ఓ వైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు కమెడియన్ గా రావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు సునీల్. ఇప్పటికే ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో కమెడియన్ గా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. మొత్తానికి ఇప్పుడు సునీల్ కెరీర్ 2 కంట్రీస్ పై ఆధారపడి ఉందన్నమాట. మరి ఈ రెండు దేశాలు ఈ భీమవరం బుల్లోన్ని ఏం చేస్తాయో చూడాలిక..!