హింస.. రక్తదాహం.. ఆధిపత్యం.. ఇగో.. ఆశ.. వెన్నుపోట్లు ఇదే వ‌ర్మ క‌డ‌ప ట్రైల‌ర్లోలో ఉంది

Kadapa trailer
తొండ ముదిరి ఊస‌ర‌వెల్లి అవుతుందంటారు.. ఇప్పుడు దానికంటే అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉన్నాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. అస‌లు ఈయ‌న్ని ఏమ‌నాలో కూడా అర్థం కావ‌ట్లేదు. ఏం చేయాల‌నుకుంటున్నాడో కూడా చెప్ప‌ట్లేదు. ఇండియ‌న్ సినిమాను త‌న టెక్నాల‌జీతో ఎక్క‌డికో తీసుకెళ్లిన వ‌ర్మ‌.. మ‌రో ప్ర‌య‌త్నం చేస్తున్నాడిప్పుడు. అస‌లు మ‌నం మాట్లాడుకోలేని భాష‌తో వెబ్ సిరీస్ చేస్తున్నాడు. అందులో య‌ధేచ్ఛ‌గా బూతులు పెట్టేసాడు. వ‌ర్మ తాజాగా విడుద‌ల చేసిన క‌డ‌ప ట్రైల‌ర్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. క‌చ్చితంగా ఈ సిరీస్ విడుద‌లైన త‌ర్వాత వివాదాస్ప‌దం కావ‌డం మాత్రం ఖాయంగా క‌నిపిస్తుంది.
రామ్‌గోపాల్‌ వర్మ మ‌న‌సు ఎప్పుడు ఎక్క‌డ మ‌ళ్లుతుందో ఎవ‌రికీ అర్థం కాదు. ఓసారేమో వ‌ర‌స‌గా సినిమాలు చేస్తాడు.. మ‌రోసారి అస‌లు సినిమాలే చేయ‌డు.. ఇంకోసారి సీరియ‌ల్స్ నిర్మిస్తానంటాడు.. ఇప్పుడు ఈయ‌న చూపు వెబ్‌ సిరీస్‌లపై ప‌డింది. బాలీవుడ్ లో ఇప్పుడు వీటికి ఉన్న డిమాండ్ తెలుసుకుని.. ఇక్క‌డి ప్రేక్ష‌కుల వీక్ నెస్ పై కొడుతున్నాడు వ‌ర్మ‌. ఇప్ప‌టికే మాఫియా బ్యాక్ డ్రాప్ లో గ‌న్స్ అండ్ థైస్ రూపొందిస్తున్నాడు. ఇక ఇప్పుడు క‌డ‌ప పేరుతో మ‌రో వెబ్ సిరీస్ మొద‌లుపెట్టాడు వ‌ర్మ‌. ఈ ట్రైల‌ర్ ఇప్పుడు విడుద‌లైంది. చావు ఎప్పుడు చెప్పిరాదు.. పగ లేని బతుకు బతుకే కాదు.. ఒక్క‌న్ని చంపితే నేరం.. ప‌ది మందిని చంపితే లీడ‌ర్.. ఇలా ఎన్నో డైలాగుల‌తో 4 నిమిషాల ట్రైల‌ర్ ను విడుద‌ల చేసాడు వ‌ర్మ‌. టీవీల్లో సెన్సార్ ఉండ‌దు కాబ‌ట్టి తాను చూపించాల‌నుకున్న ప్ర‌తీ విష‌యాన్ని చూపించాడు వ‌ర్మ‌.
రాయలసీమలోని ఫ్యాక్షన్ కోర‌లు విప్పితే ఎలా ఉంటుందో ఈ వెబ్‌ సిరీస్‌లో చూపించ‌నున్నాడు వ‌ర్మ‌. సిల్వ‌ర్ స్క్రీన్ పై త‌న‌కు ఇష్ట‌మైన క‌థ‌ల‌ను చెప్పాల‌నుకున్న‌పుడు సెన్సార్ ఉంటుంది. అందుకే న‌చ్చిన కథలను చెప్పలేని పరిస్థితి ఉండటంతో డిజిటల్‌ ప్రపంచంలోకి వచ్చానన్నాడు వ‌ర్మ‌.  హింస.. రక్తదాహం.. ఆధిపత్యం.. ఇగో.. ఆశ.. వెన్నుపోట్లు ఇలా ఓ మ‌నిషిలో ఉండే ప్ర‌తీ విష‌యానికి కేరాఫ్ అడ్ర‌స్ గా ఉండే ఓ ప్రాంతం నుంచి పుట్టిందే ఈ క‌డ‌ప అంటున్నాడు వ‌ర్మ‌. మొత్తానికి తాను చేయాల‌నుకున్న ప‌ని స‌గం చేసాడు వ‌ర్మ‌. మ‌రి పూర్తి సినిమా చూపిస్తే ప‌రిస్థితి ఇంకెలా ఉంటుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here