అజ్ఞాతవాసి వచ్చి అప్పుడే వారం రోజులు కావొస్తుంది. ఈ చిత్రం ఇప్పటి వరకు 50 కోట్ల షేర్ సాధించేసింది. డిజాస్టర్ టాక్ తో కూడా ఈ చిత్రం ఐదు రోజుల్లోనే 50 కోట్ల మార్క్ అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 80 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే పవన్ ఇమేజ్ కు ఇది సరిపోతుందేమో కానీ సినిమాకు మాత్రం ఇది సరిపోదు. తొలిరోజు వచ్చిన టాక్ తో సినిమా డిజాస్టర్ అని అంతా ఫిక్సైపోయారు. అయితే ఇప్పుడు అంతా ఆలోచిస్తున్నది మాత్రం ఒక్కటే అజ్ఞాతవాసి ప్రయాణం ఎక్కడి వరకు వచ్చి ఆగుతుంది అని..! నాన్ బాహుబలి కేటగిరీలో ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా చేయని బిజినెస్ చేసింది ఈ చిత్రం. సౌత్ లో 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ దాటిన మూడు సినిమాల్లో ఇది కూడా ఒకటి. దీనికి ముందు స్పైడర్.. మెర్సల్ ఉన్నాయి. ఆ అంచనాలు అందుకున్న సినిమా మెర్సల్ మాత్రమే. ఈ చిత్రం 244 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక అజ్ఞాతవాసి మాత్రం అడ్డంగా బయ్యర్లను ముంచేయడానికి రెడీ అయిపోయింది. అసలు 120 కోట్ల బిజినెస్ చేసిన సినిమాను ఇంత దారుణంగా ఎలా తీస్తారు.. అని ప్రశ్నిస్తున్నారు మనసు మండిన అభిమానులు. పవన్ 25వ సినిమా కదా అని కోట్లాది ఆశలతో వచ్చిన అభిమానుల ఆశలపై నిండా నీళ్లు పోసారు పవన్ అండ్ త్రివిక్రమ్. ఏం చేసినా చూస్తారులే అనే అతి విశ్వాసమే ఇప్పుడు అజ్ఞాతవాసి కొంప ముంచేసిందేమో అనిపిస్తుంది కాస్త లోతుగా జాగ్రత్తగా ఆలోచిస్తే..! ఈ పాపం ఎవరిది అయినా కానీ ఇప్పుడు మునిగేది మాత్రం బయ్యర్లే. ఈ చిత్రం ఎలా చూసుకున్నా ఫైనల్ రన్ లో మహా అయితే మరో 5 కోట్ల షేర్ కూడా తీసుకొస్తుందో లేదో అనేది అనుమానమే. అంటే నికరంగా 65-70 కోట్ల వరకు నష్టాలు తప్పకపోవచ్చు..!