చిన్న సినిమాలను బతికించాలనే ప్రయత్నం ఇండస్ట్రీలో చాలా రోజులుగా జరుగుతుంది. అసలు చిన్న సినిమా ఉంటేనే కదా.. పెద్ద సినిమాలేనివి ఒకటి ఉన్నాయని తెలియడానికి. కానీ కొన్నాళ్ల నుంచి చిన్న సినిమాలకు ఇండస్ట్రీలో గడ్డుకాలం నడుస్తుంది. వాటికి థియేటర్స్ ఇవ్వకపోవడం.. సరైన టైమ్ లో విడుదల కానీయకుండా అడ్డుకోవడం.. ఇలా చాలా జరుగుతున్నాయి. దాంతో నిర్మాత సురేష్ బాబు ఇప్పుడు చిన్న సినిమాలకు బతికించడానికి చాలా ట్రై చేస్తున్నారు. కానీ ఏదీ వర్కవుట్ కావట్లేదు. ఆ మధ్య పెళ్లిచూపులు సినిమాను వారం రోజుల ముందు నుంచీ షోస్ వేసారు.. అది సక్సెస్. కానీ మెంటల్ మదిలో సినిమాకు అదే చేస్తే ప్లాన్ బెడిసికొట్టింది. సినిమాకు మంచి టాక్ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం రాలేదు. ఈ చిత్రానికి టైటిల్ కరెక్ట్ కాదేమో అన్నారు సురేష్ బాబు.
ఇక మెంటల్ మదిలో చిత్ర ప్రెస్ మీట్ లోనే మాట్లాడుతూ ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలపై ఆయన మండిపడ్డారు. ఈ రోజుల్లో ఓ సినిమాను థియేటర్స్ లో చూడ్డానికి ప్రేక్షకులు ఎందుకు ఇష్టపడటం లేదు.. రేటింగ్స్ బ్రహ్మాండంగా వచ్చిన సినిమాలు కూడా ఎందుకు ఫెయిలవుతున్నాయి అనే విషయంపై ఎవరైనా ప్రశ్నించుకుంటున్నారా అని అడిగాడు సురేష్ బాబు. దానికి కారణం ప్రేక్షకులకు ఆల్టర్ నేటివ్స్ బాగా పెరిగిపోవడం అని.. అందరూ ఫోన్ లో జియోలు వేసుకుని సినిమాలు చూస్తుంటే.. అమేజాన్ లో నాలుగు వారాలకే సినిమా అప్ లోడ్ చేస్తుంటే ఇక థియేటర్స్ కు ఎవడు వస్తాడన్నాడు సురేష్ బాబు. అంతేకాదు.. థియేటర్స్ లో రాబోయే సినిమాకు సంబంధించిన ట్రైలర్స్ ఫ్రీగా వేయాలి.. అది ఇంటర్నేషనల్ గా జరుగుతుంది.. ఒక్క ఇండియాలో తప్ప. ఇక్కడ పిండి యాడ్లు వేసుకుంటారు కానీ ట్రైలర్లు ఎవడూ వేయడన్నారాయన.
ఈ రోజుల్లో ఓ సినిమా సక్సెస్ ను రెండు వారాల్లో డిసైడ్ చేస్తున్నారని.. ఒకప్పుడు విడుదలైన ఏడాదికి కానీ సినిమా టీవీల్లో వచ్చేది కాదు అందుకే థియేటర్స్ కు జనాలు వచ్చేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. నాలుగు వారాలు ఆగితే టీవీల్లోనే వేస్తున్నారు. ఇక సినిమా చూడాలనుకున్న ప్రేక్షకులు థియేటర్స్ కు ఎందుకు వస్తారని ప్రశ్నించాడు సురేష్ బాబు. ఈ విషయంపై ఇండస్ట్రీలో అందరితో కూర్చుని మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు ఈయన. ఇదే పని చేయడానికి తాను ముందుకొచ్చానంటున్నాడు సురేష్ బాబు. వాళ్లను తప్పుపట్టడం లేదని.. కానీ అలా చేయడం వల్ల కచ్చితంగా సినిమా దెబ్బతింటుందంటున్నాడు సురేష్ బాబు. చిన్న సినిమాలను కనీసం చూడ్డానికి కూడా ఎవరూ ప్రేక్షకులు రాక పోవడం బాధ కలిగిస్తుందన్నాడు ఈ నిర్మాత. మరి ఈయన ఆవేదన ఎంతమందికి అర్థమవుతుందో చూడాలిక..!