కాలం చాలా వేగంగా గడిచిపోయింది. ఒకటి రెండు కాదు.. అల్లుఅర్జున్ ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు గడిచిపోయాయి. మనకు ఇంకా నిన్న గాక మొన్న వచ్చినట్లే అనిపిస్తుంది. కానీ ఈయన తొలి సినిమా గంగోత్రి 2003.. మార్చ్ 28న విడుదలైంది. అల్లు వారింటి నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చాడు బన్నీ. ఈ చిత్రాన్ని రాఘవేంద్రరావ్ డైరెక్ట్ చేసాడు. గంగోత్రి మంచి విజయమే సాధించింది. కానీ ఈ చిత్రం హిట్టైనా కూడా అల్లు అర్జున్ లుక్స్ పై ఇండస్ట్రీలో చాలా విమర్శలే వచ్చాయి. వారసత్వం ఉంటే హీరో అయిపోతారా అంటూ అప్పట్లో బన్నీపై చాలా జోకులు పేలాయి. కానీ విమర్శించిన నోళ్లతోనే ఆర్యగా వచ్చి ప్రశంసలు అందుకున్నాడు బన్నీ. 2004లో వచ్చిన ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. సుకుమార్ కు ఇదే తొలి సినిమా. ఈ చిత్రంతో పూర్తిగా మేకోవర్ అయ్యాడు అల్లుఅర్జున్.
బన్నీతో హ్యాట్రిక్ పూర్తి చేసాడు అల్లు అర్జున్. తొలి మూడు సినిమాలతో వరస విజయాలు అందుకున్న అతికొద్ది మంది హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు. బన్నీ తర్వాత హ్యాపీ నిరాశపరిచినా.. దేశముదురుతో ఫామ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత పరుగుతో మరో హిట్ కొట్టాడు. కానీ ఆర్య 2.. వరుడు.. వేదం.. బద్రీనాథ్ లాంటి సినిమాలు బన్నీ ఇమేజ్ ను బాగా దెబ్బ తీసాయి. 2012లో జులాయి సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు అల్లుఅర్జున్. ఈ సినిమాతో తొలిసారి 40 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత వరస విజయాలు అందుకుని బన్నీ స్టార్ అయ్యాడు. ఇద్దర మ్మాయిలతో ఫ్లాప్ అయినా.. రేసుగుర్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
2015 నుంచి బన్నీకి గోల్డెన్ టైమ్ నడుస్తుంది. సన్నాఫ్ సత్యమూర్తి.. సరైనోడు.. డిజే లాంటి సినిమాలు ఈయన రేంజ్ ఏంటో చూపించాయి. యావరేజ్ టాక్ వచ్చిన డిజే కూడా 70 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు బన్నీకి 80 కోట్లు టార్గెట్. ప్రస్తుతం ఈయన నా పేరు సూర్యతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం మే 4న విడుదల కానుంది. వక్కంతం వంశీ దర్శకుడు. ఈ 15 ఏళ్ల ప్రయాణంలో తెలుగు వాళ్ళతో పాటు మళయాలీ ప్రేక్షకుల మనసు కూడా దోచుకున్నాడు అల్లుఅర్జున్. అక్కడి వాళ్లతో మల్లు అర్జున్ అని పిలిపించుకున్నాడు బన్నీ. మొత్తానికి 15 ఏళ్ల జర్నీ బన్నీకి మంచి అనుభవాలనే మిగిల్చింది.